ముంగిట్లోకి వచ్చిన నైరుతి అన్నా కరుణించేనా?

Update: 2015-08-24 05:22 GMT
మండిపోయిన ఎండలకు చెక్ చెబుతూ చల్లటి వాతావరణం ఏర్పడేలా రుతుపవనాలు ముందుగా వచ్చేసి మురిపించాయి. దీంతో.. ఈసారి వర్షాలు సంవృద్ధిగా ఉంటాయని ఆశించిన వారికి రుతుపవనాలు దొంగ దెబ్బ కొట్టాయి. అనుకున్నంత స్థాయిలో వర్షాలు లేకపోవటంతో రెండో వేసవిని తలపించేలా వాతావరణం ఉన్న పరిస్థితి తెలిసిందే.

ఆగస్టు నాటికి కూల్ గా ఉండే వాతావరణం అందుకు భిన్నంగా వేడితో మంట పుట్టిస్తూ.. చెమటతో చిరాకు పుట్టిస్తున్నాయి. నిజానికి ఈ పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఇంచుమించు ఇలానే ఉంది. దేశంలో కురవాల్సిన వానలు అనుకున్న దాని కంటే తక్కువగా కురిసినట్లు అధికారులు చెబుతున్నారు. రుతుపవనాలు ముఖం చాటేయటంతో వర్షాలు కురిసే నైరుతి రుతుపవనాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్లే నైరుతి రుతుపవనాలు రెండు రాష్ట్రాల్లో కమ్మేశాయి. శని.. ఆదివారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. రాయలసీమ పరిధిలోని నగరి (చిత్తూరు జిల్లా)లో అత్యధికంగా 6 సెంటీమీటర్లు.. జమ్మలమడుగు.. పొద్దుటూరులో (కడప జిల్లా) 5 సెంటీమీటర్లు.. మడకశిర.. రామగిరిలలో 4 సెంటీమీటర్లు.. కృష్ణా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురిశాయి.

ఆదివారం పశ్చిమ మధ్య తీరాన్ని అనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడింది. ఒడిశా.. ఏపీ ఉత్తరకోస్తా సమీపంలోని సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. అన్నీ బాగుంటే రెండుమూడు రోజుల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. విస్తారంగా వర్షాలు కురిసే వీలుంది. ఇప్పటికే వర్షాభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు.. నైరుతి అయినా తీపి గుర్తుని మిగిల్చి వెళితే అంతకు మించిన సంతోషం ఇంకేం ఉంటుంది..?
Tags:    

Similar News