స్పెయిన్ లో ఇప్పుడెంత దారుణమైన పరిస్థితి అంటే?

Update: 2020-03-15 16:30 GMT
కరోనా పిశాచి ఆరాచకం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే యూరప్ లోని బుజ్జి దేశం స్పెయిన్ ను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఈ అందాల చిట్టి దేశంలో ఇప్పటివరకూ దేనికి కొరత లేకుండా హాయిగా అక్కడి ప్రజలు జీవనాన్ని సాగిస్తున్నారు. అలాంటి దేశానికి ఉన్నట్లుండి మాయదారి కరోనా పట్టేయటం.. ఆ పిశాచి ఉడుంపట్టు నుంచి తప్పించుకోవటం ఎలానో అర్థం కాక కిందామీదా పడిపోతున్నారు.

స్పెయిన్ అన్నంతనే బుల్ ఫైట్ గుర్తుకు వస్తుంది. అంత పెద్ద ఎద్దులతో తలపడే వారికి కంటికి కనిపించని అతి చిన్న సూక్ష్మజీవి దెబ్బకు ఆ దేశం హడలిపోతోంది. చివరకు ఆ మాయదారి వైరస్.. దేశ ప్రధాని భార్యకు సోకింది. దేశంలోని ఏ మూల చూసినా కరోనా కేసులు బయటకు రావటంతో.. ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 4.6 కోట్ల జనాభా ఉండే ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. కట్ట తెగినట్లుగా ఇప్పుడా దేశ పరిస్థితి నెలకొంది.

మొన్నటి వరకూ యూరప్ లోని ఇటలీలో కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తుందన్న పరిస్థితి. తాజాగా స్పెయిన్ పరిస్థితి చూస్తే.. ఇటలీ కంటే పరిస్థితి దారుణంగా ఉందంటున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో 5753 మందికి కరోనా సోకినట్లు చెబుతన్నారు. అధికారిక లెక్కలు ఇలా ఉంటే.. అనధికారికంగా మరెంత మందికి కరోనా వైరస్ పట్టేసిందో అర్థం కావట్లేదంటున్నారు.  

కరోనా కారణంగా దేశంలోని పరిస్థితులు చేయి దాటిపోతున్న విషయాన్ని గమనించిన ఆ దేశప్రధాని.. నిన్నటి నుంచి (శనివారం) కొత్త కండీషన్లను తెర మీదకు తీసుకొచ్చేశారు. దీని ప్రకారం ఇప్పుడా దేశంలో ఎవరూ ఇళ్లల్లో నుంచి బయటకు రాకూడదు. ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు.. వైద్యుల వద్దకు వెళ్లేవాళ్లు.. నిత్యవసర వస్తువుల్ని సరఫరా చేసే వారు మాత్రమే బయటకు రావాలి. రానున్న పదిహేను రోజుల పాటు ఇదే తీరుతో వ్యవహరించాలని తేల్చేశారు.

దీంతో.. ఇప్పుడా దేశం మొత్తం స్తంభించిపోయిన పరిస్థితి. వీధులన్ని ఖాళీ అయిపోయాయి. ఇళ్లల్లో నుంచి ప్రజలెవరూ భయంతో బయటకు రావటం లేదు. యూరప్ లో ఇటలీ తర్వాత అత్యధిక కేసులు స్పెయిన్ లోనే నమోదవుతున్నాయి. ఒక్క శనివారమే కొత్తగా 1500కేసులు నమోదు కావటం అంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటివరకూ కరోనా కారణంగా స్పెయిన్ లో 183 మంది చనిపోయారు. దేశంలోని పరిస్థితులపై ఏడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన ప్రధాని స్వయంగా టీవీ స్క్రీన్ల మీదకు వచ్చి.. ప్రజలు ఏం చేయాలో చెప్పారు. దీంతో.. స్పెయిన్ లోని అన్ని మూసివేశారు. మందుల షాపులు.. సూపర్ మార్కెట్లు.. ఆసుపత్రులు మాత్రమే ఓపెన్ చేస్తున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే ఇళ్లల్లో నుంచి బయటకు వస్తున్న పరిస్థితి. నిత్యం యాత్రికులతో కళకళలాడే ఆ దేశ రాజధాని ఇప్పుడు బోసిపోయి.. కరోనా పిశాచి వేస్తున్న రంకెలతో హడలిపోతోంది.
Tags:    

Similar News