రూ.500 - రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లుగా నవంబర్ 8వ తేదీ రాత్రి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించి గురువారానికి 50 రోజులు పూర్తి అవుతోంది. నోట్లరద్దు అనే ఓ అనూహ్యమైన నిర్ణయంతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురయ్యింది. పెళ్లిళ్ల వంటి కార్యక్రమాలున్న వారు, ఇంటి నిర్మాణం చేపట్టినవారు... చేతిలో ఉన్న నగదు రాత్రికి రాత్రే పనికి రాకుండా పోవటంతో ఏం చేయాలో తోచని పరిస్థితికి లోనయ్యారు. సామాన్యుల కష్టాలకు అంతే లేకుండా పోయింది. మరోవైపు - అధికారులు జరిపిన దాడుల్లో నల్లధనం కుప్పలుతెప్పలుగా బయటపడింది. నగదు రహిత లావాదేవీలవైపు ప్రజలు మళ్లాలంటూ కేంద్ర - రాష్ట్రప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాయి. మొత్తమ్మీద 50 రోజుల్లో ఎన్నో పరిణామాలు. వాటిలో ముఖ్యమైనవి...
-- పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటన వెలువడిన తర్వాత రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2,000 - రూ.500 కొత్త నోట్లను విడుదల చేయటం ప్రారంభించింది. రద్దయిన పాతనోట్లను బ్యాంకుల్లో డిసెంబర్ 30 వరకూ జమ చేయవచ్చని, లేదా బ్యాంకుల్లో కొత్తనోట్లతో వాటిని మార్చుకోవచ్చని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అయితే, నోట్లమార్పిడిని నవంబర్ 24 వరకే అనుమతిస్తామని తర్వాత ప్రకటించారు. గ్యాస్ సిలిండర్లు - రైల్వేటికెట్లు తదితరాల కొనుగోలుకు పాతనోట్లను డిసెంబర్ 15 వరకూ అనుమతించారు. ఏటీఎంల నుంచి రోజుకు రూ.2,500 - వారానికి రూ.24 వేల గరిష్ఠ పరిమితిని విధించారు. పాతనోట్లతో రూ.5,000 కన్నా ఎక్కువమొత్తంలో బ్యాంకులో డిపాజిట్ చేయటానికి డిసెంబర్ 30లోపు ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంటుందంటూ ఆర్బీఐ డిసెంబర్ 19న ఒక సర్క్యులర్ ను విడుదల చేసి... ఆ తర్వాత ఉపసంహరించుకున్నది. అయితే నోట్ల రద్దు నిర్ణయం సామాన్యుల పాలిట పెనువిఘాతంగా మారింది. జేబులో ఉన్న పెద్దనోట్లు పనికిరాక - బ్యాంకులో ఉన్న సొమ్మును తీసుకోలేక జనం విలవిల్లాడారు. ఏటీఎంల ముందు గంటలపాటు నిల్చున్నా... తగినంత కరెన్సీ రాకపోవటంతో నిత్యావసరాలకు కూడా అల్లాడిపోయారు. క్యూలలో గంటలకొద్ది నిలబడి పలువురు ప్రాణాలు వదిలారు. మరోవైపు, చిరువ్యాపారులు బేరాలు లేక తీవ్రంగా నష్టపోయారు. చేతివృత్తుల వాళ్లు ఉపాధి కోల్పోయారు.
-- నోట్లరద్దు నిర్ణయాన్ని ప్రభుత్వం గట్టిగా సమర్థించుకున్నప్పటికీ అనేక ప్రతిపక్షపార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా - ఆమ్ ఆద్మీపార్టీ - తృణమూల్ కాంగ్రెస్ గట్టి నిరసన తెలిపాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాలు స్తంభించిపోయాయి. దీనిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ... దేవుడి కోసమైనా మీరు మీ పని చేయండి అంటూ పార్లమెంటులో చర్చలు నిర్వహించాల్సిందిగా సూచిస్తూ ఎంపీలకు పిలుపునిచ్చారు. నోట్లరద్దు నిర్ణయాన్ని బీహార్ సీఎం నితీశ్ కుమార్ బహిరంగంగా సమర్థించారు.
--నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. సెమీక్లోజ్డ్ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్ స్ట్రుమెంట్స్ బ్యాలెన్స్ పరిమితిని రూ.20,000కు పెంచుతూ ఆర్బీఐ నవంబర్ 22న నిర్ణయం తీసుకుంది. నగదు రహిత లావాదేవీలకు డిసెంబర్ 8న కేంద్ర ఆర్థికశాఖ పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది. పెట్రోల్ - డీజిల్ కొనుగోలుకు డెబిట్ - క్రెడిట్ కార్డులు - ఈ వ్యాలెట్ - మొబైల్ వ్యాలెట్ ద్వారా చెల్లింపులు జరిపితే... 0.75 శాతం తగ్గింపు లభిస్తుందని తెలిపింది. నగదురహిత లావాదేవీలవైపు వ్యాపారులను, వినియోగదారులను ఆకర్షించటానికి రెండు లాటరీ పథకాలను కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. అవి... డిజీ ధన్ వ్యాపార్ యోజన (వ్యాపారుల కోసం) - లక్కీ గ్రాహక్ యోజన (వినియోగదార్ల కోసం). లక్కీ గ్రాహక్ యోజన కింద డ్రా తీసి విజేతలను రోజువారీతోపాటు వారానికి ఒకసారి ఎంపిక చేసి బహుమతులను అందజేస్తారు. డిజీ ధన్ వ్యాపార్ యోజన కింద వారానికి ఒకసారి విజేతలను ఎంపిక చేస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఒక కోటి రూపాయల మెగాడ్రా ఉంటుంది.
-- రూ.500 - రూ.1000 నోట్ల రద్దు తర్వాత ఆదాయంపన్ను శాఖ రంగంలోకి దిగి కొరడా ఝుళిపించింది. పన్ను చెల్లించని 3,589 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆదాయం పన్ను రిటర్నులు దాఖలు చేయని 67.54 లక్షల మందిని గుర్తించింది. ఐటీ అధికారులు - పోలీసులు జరిపిన దాడుల్లో నల్లధనం మూటలు - బంగారం నిల్వలు బట్టబయలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి వద్ద భారీఎత్తున నగదు - బంగారం బయటపడింది. దీంతో ఆయనను బోర్డు నుంచి తొలగించారు. మరోవైపు, ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడు ప్రధాన కార్యదర్శి రామ్ మోహన్ రావు తన పదవిని కోల్పోయారు.
--నల్లధనాన్ని వెలికితీయటానికి ప్రజలే ప్రభుత్వానికి సమాచారాన్ని ఇస్తున్నారని ప్రధాని మోదీ ఇటీవల మన్‌కీబాత్‌లో వెల్లడించారు. నల్ల కుబేరుల వివరాలను BLACKMONEYINFO @INCOMETAX. GOV.IN కు తెలియజేయాలంటూ ప్రజల్ని ప్రభుత్వం గతంలోనే కోరింది. డిసెంబర్ 20 నాటికి దాదాపు నాలుగు వేల మంది ఈ వెబ్‌సైట్‌కు వివరాల్ని తెలియజేసినట్లు సమాచారం. లెక్కలు చూపని ఆదాయాన్ని కలిగి ఉన్న వారికి కేంద్రప్రభుత్వం... ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పేరుతో డిసెంబర్ 17న కొత్త పథకాన్ని ప్రకటించింది. దీనిప్రకారం వెల్లడించే మొత్తంపై 50 శాతం పన్ను - సర్ ఛార్జి విధిస్తారు. మొత్తంసొమ్ములో నాలుగోవంతును బ్యాంకులో ఎలాంటి వడ్డీ లేకుండా జమ చేయాల్సి ఉంటుంది. మార్చి 31 వరకూ ఈ పథకం అమల్లో ఉంటుంది.
--బినామీ ఆస్తులను కలిగి ఉన్న వారిపై చర్యలు తీసుకోవటానికి వీలుగా సంబంధిత చట్టాన్ని త్వరలో పూర్తిస్థాయిలో అమలుచేస్తామని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించారు. నోట్లరద్దు తర్వాత కొత్తనోట్లను ప్రజలకు పంపిణీ చేయటంలో సైనికదళాలు ముఖ్యంగా వాయుసేన బాగా కృషి చేసింది. ఇప్పటివరకూ 610 టన్నుల కొత్త నోట్లను భారీ విమానాల ద్వారా తరలించామని వాయుసేన అధిపతి అరూప్ రాహా వెల్లడించారు. కొత్తనోట్ల పంపిణీ కోసం విమానాలను 35సార్లు తిప్పామని చెప్పారు. మరోవైపు, కొత్తనోట్ల ముద్రణ జరుగుతున్న ప్రభుత్వ ముద్రణాలయాల వద్ద గట్టి భద్రతను కల్పించటం కోసం సైనికదళాల్ని భారీఎత్తున మోహరించటం జరిగిందని ఆయన గుర్తుచేశారు.
-- రద్దయిన రూ.500 - రూ.1,000 నోట్ల విలువ మొత్తం రూ.15.4 లక్షల కోట్లుకాగా... ఇప్పటికే బ్యాంకుల వద్దకు పాతనోట్ల రూపంలో రూ.14 లక్షల కోట్ల మొత్తం జమ అయ్యింది. కనీసం రూ.3 లక్షల కోట్ల విలువైన పాతనోట్లయినా బ్యాంకులకు రాకుండా ఉంటే... ఆ మేరకు కొత్త కరెన్సీని విడుదల చేయకుండా లాభపడవచ్చన్న కేంద్రప్రభుత్వం అంచనాలు తలకిందులైనట్లు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. రద్దయిన పాతనోట్లను పరిమితికి మించి కలిగి ఉంటే రూ.10 వేలు లేదా సొమ్ముకు ఐదురెట్లు జరిమానా విధించాలని పేర్కొనే ఆర్డినెన్స్‌ను కేంద్రప్రభుత్వం బుధవారం ఆమోదించింది. మార్చి 31 తర్వాత నిర్దేశిత పరిమితికి మించి పాతనోట్లను కలిగి ఉన్న వారిపై జరిమానా విధిస్తారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/