ఏపీలో మళ్లీ ప్రత్యేక హోదా రచ్చ .. బాబుకి భయం , వైసీపీ కీలక నేత షాకింగ్ కామెంట్స్ !

Update: 2021-06-15 11:30 GMT
ఆంధ్రప్రదేశ్ కి  విభజన సందర్భంగా ఇచ్చిన కీలక హామీ ప్రత్యేక హోదాపై నేటి వరకూ కేంద్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అలాగే ,ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని తేల్చిచెప్పేసింది. కేంద్రం అలా చెప్తున్నా కూడా రాష్ట్రంలో మాత్రం ఏపీలో ప్రత్యేక హోదా చర్చ మాత్రం ఆగడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో ప్రత్యేక హోదాపై అధికార పార్టీని టార్గెట్‌ చేయడమే కాకుండా 25 మంది ఎంపీలిస్తే ప్రత్యేక హోదా తెస్తామంటూ వైసీపీ హామీ ఇచ్చింది. కానీ రెండేళ్లు గడిచినా ఎలాంటి పురోగతి లేదు. దీనితో టీడీపీ వైసీపీ పై విమర్శలు చేస్తుంది. ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి  ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని పదే పదే అడుగుతున్నా ఎలాంటి పురోగతి లేకపోవడంతో అధికార వైసీపీలో అసహనం పెరుగుతోంది. అదే సమయంలో వైసీపీ కేంద్రంపై ఎలాంటి ఒత్తిడీ తీసుకురాలేకపోతోందంటూ విపక్ష టీడీపీ నేతలు టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.  

తాజాగా ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ కీలక నేత, అసెంబ్లీ ఛీఫ్ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఒకసారి గమనిస్తే ప్రత్యేక హోదాపై పోరులో విపక్షాల కంటే తామే ముందుండాలని వైసీపీ భావించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం యూటర్న్‌ తీసుకున్న నేపథ్యంలో గతంలో అధికారంలో ఉన్నటీడీపీపై భారీగా ఒత్తిడి పెంచిన వైసీపీ ఇప్పుడు తాము అధికారంలో ఉన్నా అదే వైఖరి కొనసాగించాలని భావిస్తుంది. తాజాగా అసెంబ్లీ ఛీఫ్ విప్ శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్రం వెనుకడుగు వేస్తోందని , ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయిన నేపథ్యంలో హోదాపై తమ నేత జగన్ ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అదే సమయంలో విపక్ష నేత చంద్రబాబుకు ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోడీని విమర్శించాలంటే భయమని ఛీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే టీడీపీ నుంచి ప్రత్యేక హోదా సాధన విషయంలో వైసీపీపై, అలాగే  సీఎం జగన్‌ పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో దానికి కౌంటర్‌ ఇచ్చేందుకు చంద్రబాబును శ్రీకాంత్‌రెడ్డి టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది.

అలాగే , బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న తరుణంలో ప్రత్యేకహోదాపై ఒత్తిడి పెంచడం ద్వారా ఆ ప్రయత్నాలకు ఆదిలోనే చెక్‌ పెట్టాలనే ఆలోచనతోనే శ్రీకాంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్ధమవుతోంది. ప్రత్యేక హోదాతో పాటు హైకోర్టు తరలింపు విషయంలోనూ టీడీపీ వైఖరి పై శ్రీకాంత్‌రెడ్డి విమర్శలు చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే రాజధానుల తరలింపు చేపట్టినట్లు శ్రీకాంత్‌ రెడ్డి వివరించారు. కర్నూల్లో న్యాయరాజధాని ఏర్పాటు, హైకోర్టు తరలింపుకుటీడీపీ అడ్డుపడుతోందన్నారు. త్వరలో రాజధాని తరలింపు ఖాయమని శ్రీకాంత్ తెలిపారు.  ఇప్పటికే మూడు రాజధానుల తరలింపు తథ్యం అంటూ పలువురు నేతలు చెప్తున్న సమయంలో హైకోర్టు తరలింపు పై శ్రీకాంత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Tags:    

Similar News