మళ్లీ వార్తల్లోకి వయునాడ్.. రాహుల్ కారణం కాదు

Update: 2019-04-06 09:34 GMT
కేరళలోని వయనాడ్ పేరు గడిచిన కొద్ది రోజులుగా హెడ్ లైన్స్ లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయటంతో అందరి చూపు ఈ నియోజకవర్గం మీద పడింది. అయితే.. వయునాడ్ బరిలో నుంచి రాహుల్ దిగటంపై కొందరు పాజిటివ్ గా.. మరికొందరు నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి.

ఇలాంటివేళ వయనాడ్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే.. ఈసారి రాజకీయంగా కాదు.. ఒక సామాన్యురాలి అసమాన ప్రతిభ వెలుగులోకి రావటం విశేషం. శుక్రవారం సాయంత్రం విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల నేపథ్యంలో వయనాడ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ ప్రాంతానికి చెందిన ఒక ఆదివాసీ అమ్మాయి సివిల్ సర్వీసెస్ లో 410వ ర్యాంక్ సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది.

వయునాడ్ జిల్లాలోని పోఝుథానా దగ్గర్లోని అచూరణం అనే చిన్న కుగ్రామానికి చెందిన 22 ఏళ్ల శ్రీధన్యా సురేశ్ అనే యువతి సివిల్ సర్వీసెస్ కు ఎన్నికయ్యారు. ఈ ప్రాంతం నుంచి సివిల్స్ కు ఎంపికైన తొలి గిరిజన మహిళగా రికార్డు సాధించారు. ఆమె సాధించిన విజయంతో పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

శ్రీధన్యా సురేశ్ కు తన అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. . ‘‘కృషి - పట్టుదలతో శ్రీధన్య తన కలను నిజం చేసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధన్యా, ఆమె కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన వృత్తి జీవితంలో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు.
Tags:    

Similar News