బాబుపై బాబాకు కోప‌మొచ్చింది

Update: 2015-11-09 15:48 GMT
విశాఖ శ్రీ శార‌దా పీఠాధిప‌తి స్వరూపానందేంద్ర‌ సరస్వతికి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వానికి మ‌ధ్య గిల్లిక‌జ్జాల స్థాయి కాస్త పోరాటం ద‌శ‌కు చేరింది. గ‌తంలో గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా త‌మ‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించ‌లేద‌ని స్వరూపానందేంద్ర  ఆక్షేపించారు. భారతీయ సంస్కృతికి పునాదులు వేసి హిందూ మతోద్ధరణ కోసం పాటుపడుతున్న పీఠాలకు, పీఠాధిపతులకు మనుగడ లేకుండా కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని స్వరూపానందేంద్ర ఆరోపించారు.  దిక్కుమాలిన ప్రభుత్వం ఇది ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. కొద్దికాలం త‌ర్వాత‌ ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలోని ఉగాది పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో పాల్గొని...ఏపీ సర్కారు ఐదేళ్లు పరిపాలించదని శ‌పించారు. ఆ త‌ర్వాత కూడా బాబు స‌ర్కారుపై అడ‌పాద‌డ‌పా ప‌లు సంద‌ర్భాల్లో ఆక్షేపించిన‌ప్ప‌టికీ ఇప్పుడు ఏకంగా హెచ్చ‌రిక‌లు జారీచేశారు.

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ ను తవ్వాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం వివాదాస్ప‌దంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం మిన‌హా మిగ‌తా పార్టీల‌న్నీ ఈ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా విశాఖ‌లో స్వరూపానందేంద్ర‌ సరస్వతి మీడియాతో మాట్లాడుతూ....   గిరిజన ప్రాంతాలు భగవంతునితో సంబంధం ఉన్న ప్రదేశాలని అన్నారు. ప్రకృతి వనరులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. బాక్సైట్‌ తవ్వకంతో గిరిజనుల జీవనశైలి, ఆ ప్రాంత ప్రాధాన్యం కోల్పోయే ప్రమాదముందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బాక్సైట్‌ నిక్షేపాలను పరిరక్షించాలని బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. ప్ర‌భుత్వ చ‌ర్య  దుర్మార్గమని విమర్శిస్తూ అందరూ దీన్ని ఖండించాలని కోరారు.

పీఠాధిపతిగా స్వరూపానందేంద్ర స్వామి గిరిజ‌నుల కోసం స్పందించ‌డంలో త‌ప్పుప‌ట్టాల్సిందేమీ లేన‌ప్ప‌టికీ...సౌమ్యంగా ఉండాల్సిన సాములోరు ఆగ్ర‌హ‌జ్వాల‌లతో ర‌గిలిపోవ‌డం ఏంట‌ని ప‌లువురు చెవులు కొరుక్కుంటున్నారు.
Tags:    

Similar News