నిన్న ట్రాక్టర్...నేడు ఎడ్లబండిలో కరోనా మృతదేహం

Update: 2020-07-14 17:44 GMT
"మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడో కాని, కంటికి కనరాడు!" ప్రముఖ కవి, వాగ్గేయకారుడు అందెశ్రీ రాసిన ఈ పాట విన్న ప్రతిసారి మన చుట్టూ ఉన్న సమాజంలో మానవత్వం శాతం ఎంత ఉంది అన్న ప్రశ్న మదిలో మెదలక మానదు. భూమి మీద నుంచి డైనోసార్లు అంతరించిపోయినట్లు....చాలా మంది మనుషుల్లో మానవత్వం నానాటికీ అడుగంటిపోతోందనడానికి ఎన్నో ఘటనలు మన కళ్ల ముందే జరుగుతున్నాయి. అదే సమయంలో అందెశ్రీ గారు చెప్పినట్లు నూటికో కోటికో మానవత్వం ఉన్న ఆ ఒక్కడు కూడా మన కళ్ల ముందే కనిపిస్తుండడంతో మానవత్వం బ్రతికే ఉందని మనసుకు సర్ది చెప్పుకుంటున్నాం.

ప్రస్తుతం నడుస్తున్న కరోనా జమానాలో ఈ రెండు తరహా మనుషులు మనకు తారసపడుతున్నారు. కరోనా బారిన పడి మరణించిన వారి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాని ఘటనల గురించి విన్నాం. తనకు ఏ సంబంధం లేకపోయినా...కరోనా మృతదేహాన్ని ట్రాక్టర్ లో తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన వైద్యనారాయణులను చూశాం. తాజాగా, మొదటి కోవకు చెందిన మానవత్వం లేని ఘటన ఒకటి నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలో జరిగింది.

మహమ్మారి వైరస్ మనుషులలోని రోగ నిరోధక శక్తితోపాటు మానవత్వాన్ని కూడా కబళిస్తోంది. కరోనా బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలకు అంతిమ సంస్కారాలు చేయడానికి కూడా కుటుంబ సభ్యులు ముందుకు రాని ఘటనలు రోజూ వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా నల్లగొండ జిల్లాలోని శాలి గౌరారంలో ఇటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. శాలిగౌరారం మండలం ఆకరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నార్కట్‌పల్లిలో హెయిర్ సెలూన్ నిర్వహించేవాడు. భార్య, ఇద్దరు పిల్లలతో అదే ఊళ్లో ఉండేవాడు.

జులై 8వ తేదీన అతడు స్వగ్రామం ఆకరానికి తిరిగొచ్చాడు. కిడ్నీ జబ్బుతో బాధపడుతున్న అతడు అనారోగ్యానికి గురవడంతో....నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ జూన్ 10న అతడు మృతి చెందాడు. అయితే, ప్రైవేటు అంబులెన్స్ లో ఆకరం గ్రామానికి వచ్చిన అతడి మృతదేహానికి కరోనా సోకి ఉండొచ్చనే అనుమానంతో పాడె మోయడానికి కుటుంబ సభ్యులు, బంధువులెవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు ఎడ్ల బండి మీద అతడి మృతదేహాన్ని మోసుకువెళ్లి శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తాజాగా వెల్లడైన ఫలితాల్లో తేలింది. దీంతో, అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని హోం క్వారంటైన్లో ఉండాలని ఆరోగ్య కార్యకర్తలు సూచించారు.
Tags:    

Similar News