ప్లాస్మా థెరపీ ప్రాణాంతకమే... కేంద్రం సంచలన ప్రకటన

Update: 2020-04-28 14:30 GMT
ప్రాణాంతక వైరస్ కరోనా సోకిన బాధితులకు గొప్ప రిలీఫ్ ఇస్తుందని భావిస్తున్న ప్లాస్మా థెరపీపై కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన ప్రకటన చేసింది. కరోనా రోగులకు ప్లాస్మా చికిత్స ఇంకా ప్రయోగ దశల్లోనే ఉందని, ఇప్పటిదాకా ఈ చికిత్సా విధానంపై ఎలాంటి నిర్ధారణ లేదని, ఈ నేపథ్యంలో ఈ చికిత్సా విధానాన్ని అనుసరించవద్దని కూడా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కీలక ప్రకటన చేశారు.

కరోనా చికిత్సలకు ప్లాస్మా థెరపీ దివ్వౌషధమని దాదాపుగా అన్ని రాష్ట్రాలు భావిస్తున్నవేళ... కేంద్రం నుంచి వెలువడిన ఈ ప్రకటన నిజంగానే ఆయా రాష్ట్రాలను డైలమాలో పడేశాయని చెప్పక తప్పదు. అయినా ఈ దిశగా లవ్ అగర్వాల్ ఏం చెప్పారన్న విషయానికి వస్తే... ‘‘ప్లాస్మా థెరపీ నిర్ధారిత చికిత్స విధానం కాదు. ఇది కేవలం ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఈ విధానాన్ని ఎవరూ అనుసరించవద్దు. ప్లాస్మా చికిత్సా విధానాన్ని అనుసరించడం కరోనా బాధితుడికి ప్రమాదకరం. అంతేకాకుండా చట్ట విరుద్ధం. ప్లాస్మా థెరపీ ప్రయోగ దశలోనే ఉందని, కరోనాకు ఇదే చికిత్స విధానమని ఎలాంటి ఆధారం లేదు. ప్లాస్మా థెరపీ సామర్థ్యంపై జాతీయ స్థాయిలో ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోంది. ఐసీఎంఆర్ అధ్యయనం పూర్తయ్యే లోపు, ఈ చికిత్స సరైందేనని శాస్త్రీయ నిరూపణ జరిగే వరకూ ప్లాస్మా థెరపీని కేవలం ప్రయోగపరంగానే అనుసరించాలి. కరోనా బాధితుడికి ప్లాస్మా థెరపీని సరైన మార్గదర్శకాలు పాటించకుండా అందిస్తే అతని ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది’’ అని అగర్వాల్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే... ఇప్పటికే ప్లాస్మా థెరపీని దేశంలోని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేయాలని ఆయా రాష్ట్రాలు కోరుతున్నాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చొరవతో పలువురు ఈ వైరస్ సోకిన పలువురు ముస్లింలు రక్త దానానికి ముందుకొచ్చారు. అంతేకాకుండా చాలా రాష్ట్రాలు ప్లాస్మా థెరపీతో కరోనాను అంతమొందించే అవకాశాలున్నాయన్న కోణంలో ఈ థెరపీ చికిత్సలను కూడా ప్రారంభించేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్లాస్మా థెరపీపై కేంద్రం తాజా ప్రకటనతో ఆయా రాష్ట్రాలు డైలమాలో పడ్డాయి.
Tags:    

Similar News