ప్ర‌భుత్వ ఉద్యోగాలు లేవ‌ని.. పురుగుల మందు తాగిన విద్యార్థి మృతి!

Update: 2021-04-02 10:30 GMT
తెలంగాణ స‌ర్కారు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇవ్వ‌ట్లేద‌ని, అందుకు నిర‌స‌న‌గానే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని మార్చి 26న‌ సెల్ఫీ వీడియోలో చెప్పి, పురుగుల మందు తాగాడు కాక‌తీయ యూనివ‌ర్సిటీ విద్యార్థి సునీల్. అత‌న్ని తొలుత వ‌రంగ‌ల్ ఎంజీఎంకు, ఆ త‌ర్వాత హైద‌రాబాద్ నిమ్స్ కు త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ.. ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్ర‌వారం క‌న్నుమూశాడు.

మ‌హబూబాబాద్ జిల్లా గూడురు మండ‌లం తేజావ‌త్ రామ్ సింగ్ తండాకు చెందిన సునీల్‌.. ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు. 2016లో ఎస్ఐ ప‌రీక్ష‌లో క్వాలిఫై కూడా అయ్యాడు. కానీ.. ఫిజిక‌ల్ టెస్టులో ఎత్తు త‌క్కువ‌గా ఉన్న కార‌ణంగా ఉద్యోగం కోల్పోయాడు. అయిన‌ప్ప‌టికీ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నం చేస్తూనే ఉన్నాడు. అయితే.. రాష్ట్ర ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్లు వేయ‌ట్లేద‌ని తీవ్ర ఆవేద‌నకు గుర‌య్యాడు.

ఈ క్ర‌మంలోనే మార్చి 26న సెల్ఫీ వీడియో తీశాడు. తాను ఏఎస్ఐ కావాల్సిన వాడిన‌ని, కానీ.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌ట్లేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశాడు. దానికి నిర‌స‌న‌గానే తాను చ‌నిపోతున్నాన‌ని చెప్పి, పురుగుల మందు తాగాడు. వారం రోజుల‌పాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందిన సునీల్ ఇవాళ తుదిశ్వాస విడిచాడు. పోలీసులు భారీ భ‌ద్ర‌త న‌డుమ మృత‌దేహాన్ని స్వ‌గ్రామం తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Tags:    

Similar News