ఓయూలో పోరడు సూసైడ్ అటెంప్ట్ చేశాడే

Update: 2017-02-22 13:18 GMT
సీమాంధ్ర పాలకులు లేరు. మొత్తంగా తెలంగాణ వారే. కానీ.. ఉస్మానియా రగిలిపోయింది. తమకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేనా.. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతలా అయితే తెగించిందో.. అలాంటివన్నీ ఈ రోజు ఉస్మానియా క్యాంపస్ లో ఆవిష్కృతమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉద్యమ రోజులు గుర్తు తెచ్చేలా చేసింది. ఎందుకిలా? ఏమైంది ఉస్మానియాకు? అన్న ప్రశ్నలు వేసుకుంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కరకుదనమే తాజా పరిణామాలకు కారణంగా చెప్పాలి.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అన్నది జరిగితే చాలు.. ఉద్యోగాలు వెల్లువలా వచ్చేస్తాయని కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పారు. ఆయన మాటల ప్రభావం ఎంతంటే.. చిన్న చిన్న ఊళ్లల్లో ఏమీ తెలీని ముసలోళ్లు సైతం.. తెలంగాణ వస్తే.. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మా జీవితం బాగు పడుతుందనే మాటను చెప్పేవారు. అన్ని ఆశలు పెట్టుకున్నాక.. తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు రాకపోవటం ఒక అసంతృప్తి. తెలంగాణ రాష్ట్రం కన్ఫర్మ్ అయ్యాక జరిగిన ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అధినేత హోదాలో కేసీఆర్ చెప్పిన మాటల్ని మర్చిపోకూడదు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ఉద్యోగాలు మస్తుగా తెప్పిస్తామని.. నిరుద్యోగుల వెతల్ని తీరుస్తామని మాట ఇచ్చారు. ఆయన మాటల్ని నమ్మి తెలంగాణ ప్రజలు అధికారాన్ని చేతికి ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రెండున్నరేళ్ల కాలంలో వచ్చిన ఉద్యోగాలు కాస్త అటూఇటూగా 64వేలు. ఇందులో సర్కారీ కొలువులే కాదు.. ప్రైవేటు జాబులు ఉన్నాయి. లక్ష సర్కారీ ఉద్యోగాలు ఖాయమన్న కేసీఆర్ మాటతో చూసినప్పుడు.. గడిచిన రెండున్నరేళ్లలోతెలంగాణ యువతకు దక్కిన సర్కారీ కొలువులు తక్కువనే చెప్పాలి.

ఇదే విషయాన్ని తెర మీదకు తీసుకొస్తూ.. కోదండం మాష్టారు నిరుద్యోగుల నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. ఒక్కసారి కానీ ఉద్యమం షురూ  అయ్యిందంటే.. దాన్ని నిలువరించటం ఎంత కష్టమన్న విషయం ఉద్యమ నేతగా కేసీఆర్ కు తెలియంది కాదు. అందుకే.. తనకున్న పవర్ తో నిరుద్యోగ ర్యాలీపై ఉక్కుపాదం మోపారు. శాంతిభద్రతల పేరుతో చేసిన ప్రయత్నాలు ఒక ఎత్తు అయితే.. నిరసన ర్యాలీకి సారధ్యం వహిస్తున్న కోదండం మాష్టార్ని తెల్లవారు జామున తలుపులు పగలకొట్టి మరీ.. అరెస్ట్ చేసిన తీరు తెలంగాణ వాదులకు మంట పుట్టేలా చేసింది.

అందరికంటే విద్యార్థులకు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. సీమాంద్రుల పాలనలో సైతం ఇలాంటివి తాము చూడలేదని.. అలాంటిది తమ వారి పాలనలో ఇలాంటివి చోటు చేసుకోవటం ఏమిటంటూ వారు ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ఇదే..నిరసన ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరాలన్న పట్టుదలను పెంచింది. ఇందుకు చెక్ పెట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఉస్మానియా విద్యార్థుల్ని ఒళ్లు మండేలా చేయటమే కాదు.. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసేలా చేసింది.

భావోద్వేగాలు పెద్ద ఎత్తున ఉన్న వేళ.. కడుపు మండిన విద్యార్థి ఒకరు చారిత్రక ఆర్ట్స్ కళాశాల ఎదుట ఒంటి మీద కిరోసిన్ పోసుకొని.. ప్రాణ త్యాగానికి సిద్దం కావటం చూసినప్పుడు నిరుద్యోగుల కడుపు మంట ఎంత ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. సందీప్ చవాన్ అనే యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించగా.. పోలీసులు వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకోవటం పెను ప్రమాదం తప్పింది.

ఈ ఉదంతంతో పాటు.. ఉస్మానియా క్యాంపస్ లో చోటు చేసుకున్న పరిణామాలు చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. తెలంగాణ ఉద్యమం వేళ.. ఉస్మానియా వర్సిటీలో ఎలాంటి భావోద్వేగం పెల్లుబికిందో కనిపించిందో అలాంటిదే ఈ రోజు కనిపించాయి. ఈ తరహా భావావేశాలు తెలంగాణ రాష్ట్రానికి మంచివి కావు. వెంటనే వీటిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సొంత రాష్ట్రంలో.. సొంత ప్రభుత్వం మీద సొంత పిల్లలు ఆత్మ బలిదానానికి సిద్ధం కావటం కేసీఆర్ సర్కారుకు శుభ సూచకం ఎంతమాత్రం కాబోదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News