గచ్చిబౌలి హాస్టల్ లో విద్యార్థుల మధ్య గొడవ.. నిద్రపోతుంటే బ్లేడ్ తో గొంతు కోశాడు

Update: 2022-04-30 07:30 GMT
చిన్న గొడవ కాస్తా పెద్ద ఇష్యూ గా మారిన ఉదంతం ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. గచ్చిబౌలికి దగ్గర్లో ఉండే గౌలిదొడ్డిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే గురుకుల పాఠశాల కమ్ హాస్టల్ ఉంది. దీనికి చాలా మంచి పేరుంది. ఈ మధ్యనే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటం ఈ సంస్థకు మరకగా మారింది. ఈ ఉదంతాన్ని మర్చిపోక ముందే.. ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవ.. చివరకు ఒక విద్యార్థి గొంతును మరో విద్యార్థి బ్లేడ్ తో గాయపర్చే వరకు వెళ్లటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ సంచలన అంశాన్ని చూస్తే.. ఈ నెల 25న సాయంత్రం స్నాక్స్ ను వడ్డించే వేళలో.. ఇంటర్ మొదటి సంవత్సరం చదివే మైనర్ విద్యార్థి ఒకరికి రెండో సంవత్సరం చదివే విద్యార్థి సేమియా వడ్డిస్తున్నాడు.

ఈ సందర్భంగా మొదటి సంవత్సరం చదివే విద్యార్థి చేయి మీద సేమియా పడటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా మాటా మాటా అనుకున్నారు. ఈ ఉదంతం కాస్త ముదిరి.. సేమియా వడ్డించిన సీనియర్ విద్యార్థి తనకు జరిగిన విషయాన్ని స్నేహితుడితో చెప్పగా.. అతను జూనియర్ విద్యార్థిపై చేయి చేసుకున్నాడు. విషయం ముదరటంతో టీచర్లు ఎంట్రీ ఇవ్వటం.. ఇరువురికి సర్దిచెప్పి.. కౌన్సెలింగ్ ఇచ్చి వారి హాస్టల్ గదులకు పంపారు.

ఇదిలా ఉండతా.. రాత్రి హాస్టల్ లో నిద్ర పోయిన జూనియర్ విద్యార్థికి అర్ధరాత్రి 1.30 గంటల వేళలో గొంతు దగ్గర నొప్పిగా ఉండటంతో లేచి చూడటం.. గొంతు దగ్గర రక్తం కారుతుండటంతో ఒక్కసారి భయాందోళనకు గురై.. గట్టిగా కేకలు వేశాడు. వెంటనే స్పందించిన హాస్టల్ సిబ్బంది ఆ విద్యార్థిని గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థికి 18 కుట్లు పడి.. ప్రాణాపాయం తప్పింది.

తనపై చేయి చేసుకున్న సీనియర్ విద్యార్థే.. బ్లేడ్ తో తన గొంతు కోసి ఉంటాడని జూనియర్ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానిత విద్యార్థి తల్లిదండ్రుల్ని పిలిచి.. విచారించారు. అనంతరం సొంత పూచీకత్తుపై అతడ్ని ఇంటికి పంపారు.

ఏదో జరిగితే తమ కొడుకును కావాలని ఇరికిస్తున్నట్లుగా సీనియర్ విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏమైనా.. చిన్న గొడవ కాస్తా.. ఒక విద్యార్థి గొంతు కోయాలన్నంత కసి మరో విద్యార్థికి ఎందుకు వచ్చిందన్న ప్రశ్న ఆందోళనకు గురి చేస్తోంది. పోలీసుల విచారణలో అసలు విషయాలు వెల్లడి కానున్నాయి.
Tags:    

Similar News