కోస్తాలో కుల సమరం - 2

Update: 2015-09-09 10:45 GMT
కులం ఏపీలోనే కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో తీవ్రమయిన ప్రభావం చూపుతోంది. అయితే మనం తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుకుందాం. కోస్తాలో కుల లీలల కారణంగా.. కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు సైతం అడ్డంగా బుక్ అయిపోతుంటారు. నిజానికి వారిలో కులాభిమానం ఉన్నా లేకున్నా.. విద్యార్థుల పుణ్యమా అని బుక్ అయిపోతారు. అలాంటి వివాదంలోకి పీకల్లోతు వరకు కూరుకుపోయి.. తెలివిగా బయటకు వచ్చిన ఒక ఉదంతాన్ని మీకిపుడు చెబుతాం.

2004 ఎన్నికల్లో వైఎస్ చొరవతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దగ్గుబాటి కుటుంబం విజయం సాధించటం తెలిసిందే. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు ఎమ్మెల్యేగా.. ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి బాపట్ల ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఎంపీగా గెలిచిన కొన్నాళ్లకు ఆమెకు యూపీఏ 1 సర్కారులో కేంద్ర సహాయమంత్రి హోదా లభించటమూ తెలిసిందే.

వ్యక్తిగతంగా పురంధేశ్వరి.. తన వద్దకు వెళ్లిన ప్రతి ఒక్కరితోనూ చక్కగా మాట్లాడి.. వారి సమస్యల్ని విని.. తనకు చేతనైనంత సాయం చేయటం చేస్తుండేవారు. ఆమెకు కులాన్ని అంటించటం తప్పే అవుతుంది. ఆమె దగ్గర కులానికి ప్రాధాన్యత ఇస్తారని ఆరోపించటం కూడా తప్పే అవుతుంది. అయితే.. చుట్టూ ఉండే వారి పుణ్యమా అని కొద్దోగొప్పో అలాంటి కలర్ వచ్చినా.. ఆమె మాత్రం అలాంటి వాటిని వ్యక్తిగతంగా అస్సలు ఎంకరేజ్ చేసేవారు కాదు.

కులం కంటే కూడా వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చే మనిషిగానే పురంధేశ్వరిని చెప్పుకోవాలి. దీనికి తోడు.. తాను.. తన భర్త రాజకీయంగా తీవ్ర ఒడిదుకులకు లోనై.. సోనియమ్మ పుణ్యమా అని ఒక స్థాయికి చేరారు. కుటుంబ పరంగా తమకు కొంత అన్యాయం జరిగిందని.. అంతకు ముందు తొమ్మిదిన్నరేళ్ల చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన కుటుంబం భారీగా నష్టపోయిందన్న భావన ఆమెలో కనిపించేదని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. అందుకే.. తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని... రాజకీయంగా తాను ఎదిగి.. బలోపేతం కావాలన్న దృష్టి కోణం తప్పించి.. కులానికి ఆమె పెద్దగా ఫ్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అలాంటి ఆమె కూడా.. కోస్తాలోని విద్యార్థుల కుల రాజకీయాలకు అడ్డంగా దొరికిపోయారు.

మానవవనరుల శాఖకు సహాయ మంత్రిగా ఉన్న సమయంలో ఒక విద్యార్థి కుల సంఘం వారు.. బీచ్ దగ్గర ఏర్పాటు చేసుకున్న స్టూడెంట్ మీట్ కు హాజరు కావాలని కోరారు. నిజానికి ఈ స్టూడెంట్ మీట్.. సదరు క్యాస్ట్ స్టూడెంట్ మీట్ అన్న మాట. ఇలాంటి మీట్ లు కులం ఆధారంగా విద్యార్థులు ప్రతిఏటా భారీగా నిర్వహిస్తుంటారు. ఇందుకోసం వారు సేకరించే విరాళాల మొత్తం వింటే కళ్లు తిరిగిపోతాయి.

ఇక పురంధేశ్వరి వ్యవహారంలోకి వస్తే ఆమె కులస్థులు సదరు కేంద్రమంత్రిని ముఖ్య అతిధిగా పిలుచుకొని.. దాని గురించి భారీగా ప్రచారం చేసుకొని.. పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థుల సంఖ్య చూసిన పురంధేశ్వరికి మొదట విద్యార్థులు కులం ఆధారంగా ఏర్పాటు చేసిన సభగా అనిపించలేదు. నిజానికి ఆమెకు కాస్త అవగాహన తక్కువే ఉండేది. కానీ.. సభ మొదలైన తర్వాత కానీ ఆమెకు అసలు విషయం అర్థం కాలేదు. తాను వచ్చింది కులాభిమాన సభకు అని. ఇక.. కార్యక్రమం జరిగినంత సేపు దీనికి మీడియా కవరేజీ రాకుంటే బాగుణ్ణు అని మదనపడ్డారు. కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న తాను.. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనకూడదన్నది ఆమె ఉద్దేశ్యం. కులం మీద అభిమానం ఉండొచ్చు కానీ.. విద్యార్థి దశలో ఇంత భారీగా ఉండటాన్ని ఆమె ఏ మాత్రం జీర్ణించుకోలేకపోయారని ఆమె సన్నిహితులు చెబుతారు.
Tags:    

Similar News