పోటు పొడిచిన సుజ‌నాకు ఇప్ప‌టికి గురువు బాబేన‌ట‌!

Update: 2019-06-21 06:12 GMT
బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా వ్య‌వ‌హ‌రించిన రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి పార్టీ మారిన సంగ‌తి తెలిసిందే. పార్టీ ఘోర ప‌రాజ‌యం అనంత‌రం ఏపీలో ఆప‌రేష‌న్ సైకిల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన బీజేపీ.. అందులో భాగంగా భారీ ఎత్తున టీడీపీ నేత‌ల‌పై ఫోక‌స్ చేసింది.

ఇందులో భాగంగా తొలిద‌శ‌లో న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యుల్ని పార్టీలోకి లాగేసుకుంది. పార్టీ ఫిరాయింపుల మీద పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతున్న వేళ‌లో.. నీతులు చెప్పే మోడీ త‌న జ‌ట్టులోకి న‌లుగురు ఎంపీల‌ను లాగేసుకున్న తీరు చూస్తే.. మోడీ మాట‌ల‌కు చేత‌లకు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసం ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మైపోతుంది.

ఇదిలా ఉంటే.. పార్టీ మారినంత‌నే ప్రెస్ మీట్ పెట్టిన సుజ‌నా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జాతి నిర్మాణం కోస‌మే తాను పార్టీ మారిన‌ట్లుగా చెప్పారు. పార్టీ ఫిరాయింపుల మాట‌ను ప్ర‌స్తావించ‌ని సుజ‌నా.. త‌న మీద వస్తున్న వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు.. ఛార్జిషీట్లు.. ఈడీ విచార‌ణ లాంటి అంశాల‌పై మాట్లాడారు. ఆర్థిక ప‌ర‌మైన అంశాల‌కు సంబంధించి త‌న‌పై ఎలాంటి ఫిర్యాదు.. ఛార్జిషీటూ లేద‌ని.. ఇటీవ‌ల వ‌చ్చిన‌వ‌న్నీ అభియోగాలు మాత్ర‌మేన‌ని క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగం ప్ర‌కారం ఎవ‌రికైనా ఎలాంటి అనుమానం వ‌చ్చినా విచారించొచ్చ‌న్నారు. చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుంటూ పోతుంద‌న్నారు.

2004 నుంచి తాను వ్యాపారాల నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాన‌ని.. వ్యాపారాలు ఉన్న‌ప్పుడు కూడా ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి పొంద‌లేద‌న్నారు. దేశాభివృద్ధికి మోడీనే స‌రైన నాయ‌కుడ‌ని తాను న‌మ్ముతున్న‌ట్లు చెప్పారు. టీడీపీ ఎన్డీయే భాగ‌స్వామ్యంలో తాను మోడీ మంత్రివ‌ర్గంలో ప‌ని చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. గ‌త ప్ర‌భుత్వంలోనే ఏపీ ప్ర‌త్యేక హోదాపై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించాన‌న్నారు.

ఏపీకి కేంద్ర‌ప్ర‌భుత్వం ప్యాకేజీ ఇవ్వ‌టానికి సిద్ధ‌ప‌డింద‌ని.. ఏపీకి ప్యాకేజీ కోసం తాను క‌ష్ట‌ప‌డిన‌ట్లు చెప్పారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయ‌మేన‌ని తాను అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్లు చెప్పారు. రాష్ట్రానికి ల‌బ్థి చేకూరే అంశాల కోసం పాటు ప‌డేందుకు తాను సిద్ధంగా ఉన్నార‌న్నారు. తాను ఏ పార్టీలో ఉంటే అక్క‌డ క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన సైనికుడిలా ప‌ని చేసిన‌ట్లు చెప్పారు.

బీజేపీలో తాము చేరిన నేప‌థ్యంలో ఏపీ విభ‌జ‌న చ‌ట్టం ప‌క‌డ్బందీగా అమ‌లు చేసేందుకు అవ‌కాశం క‌లుగుతుంద‌ని ఆశిస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌స్తుతం తన‌తో పాటు మ‌రో ముగ్గురు ఎంపీలు బీజేపీతో క‌లిసి ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు. ఏపీకి ఏది మంచిదో దాని కోసం క‌ష్ట‌ప‌డి ప‌ని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పారు. బాబు ఎప్ప‌టికి త‌నకు రాజ‌కీయ గురువేన‌ని... రాజ‌కీయాల్లో ఓనామాలు నేర్పించిందే ఆయ‌న‌న్నారు.

2004లో తాను టీడీపీలోనే ఉన్నాన‌ని.. క‌ష్ట‌కాలంలోనూ కొన‌సాగిన వైనాన్ని గుర్తు చేశారు. పార్టీ అభివృద్ధి కోసంతాను ఎంత క‌ష్ట‌ప‌డ్డానో బాబుకు తెలుస‌న్నారు. ఏపీలో టీడీపీలో నిల‌దొక్కుకోవాల‌ని ఆకాక్షించే వ్య‌క్తుల్లో తాను ఒక‌రిగా చెప్పిన సుజ‌నా.. మ‌రి బాబుకు ధోఖా ఎందుకు ఇచ్చిన‌ట్లు?  లాగి పెట్టి పీకి.. వెన్న‌రాసిన‌ట్లుగా చెప్పిన సుజ‌నా మాట‌లు వింటే.. నిజ‌మే.. బాబు త‌యారు చేసిన శిష్య‌ర‌త్నం క‌దా.. అలానే మాట్లాడ‌తారు మ‌రి.
Tags:    

Similar News