వెంకయ్యనాయుడుపై సుజనా ఫైర్

Update: 2015-12-03 06:42 GMT
ఇద్దరు కేంద్రమంత్రుల మధ్య ప్రత్యేక హోదా చిచ్చు మాటల యుద్ధానికి దారితీస్తోంది.  ఇద్దరిదీ వేర్వేరు పార్టీలైనా మిత్రపక్షాలకు చెందినవారు వారు. అంతేకాదు... కేంద్ర ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు పార్టీలతోనే ఏర్పడింది. అలాంటి బీజేపీ - టీడీపీ పార్టీలకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఒకరు అవునంటే ఇంకొకరు కాదంటూ భిన్న దారుల్లో సాగుతున్నారు.  వారిద్దరి వ్యవహారం రెండు పార్టీల నడుమ మరింత దూరం పెంచుతోంది.

బిజెపికి చెందిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు - టిడిపికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి మధ్య మొదలైన మాటల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు ఇద్దరు కేంద్రమంత్రుల మధ్య మరింత దూరం పెంచింది. ప్రత్యేక హోదా ఇవ్వడం వ్యక్తిగతంగా తనకు అంగీకారమయినప్పటికీ, దానికి ఏకాభిప్రాయ సాధన కావాలని వెంకయ్య నాయుడు రాజ్యసభలో చెప్పారు. అభివృద్ధి చెందిన పంజాబ్ సహా మిగిలిన రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయని, దాన్ని కదిలిస్తే తేనెతుట్టె కదిలించినట్టవుతుందని, పైగా ఏకాభిప్రాయసాధన ద్వారానే హోదా సాధ్యమవుతుందని వెంకయ్య చెబుతున్నారు. ఆయనకు కౌంటర్ గా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి మండిపడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ఏకాభిప్రాయ సాధన అవసరంలేదని.. వెంకయ్య ఎందుకలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. అంతేకాదు.. గతాన్ని తవ్వి బీజేపీ చేసిన పనులను గుర్తుచేసి వెంకయ్యకు కౌంటర్ ఇచ్చేలా సుజనా ఘాటుగా మాట్లాడుతున్నారు.

గతంలో ఎన్డీఏ ఉన్నప్పుడు ఏర్పడ్డ చత్తీస్‌ గఢ్ - జార్ఖండ్ - ఉత్తరాంచల్ వంటి కొత్త రాష్ట్రాలేవీ ఏకాభిప్రాయ సాధన ద్వారా వచ్చినవి కాదని చౌదరి నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న సభ్యులంతా స్వాతంత్య్రం అవసరం లేదని చెబితే మళ్లీ భారత్ ను బ్రిటీషోళ్లకు అప్పగించేస్తామా? అంటూ ఆయన చాలా తీవ్రమైన వ్యాఖ్య చేయడం కలకలం రేపింది. ప్రత్యేక హోదాపై బీజేపీ మాయమాటలపై ఎప్పటి నుంచో టీడీపీలో ఉన్న ఆగ్రహం  చౌదరి వ్యాఖ్యల రూపంలో కట్టలు తెంచుకున్నట్టయింది.

తాజా పరిణామాలు రెండు పార్టీల మధ్య మరింత దూరం పెంచేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బిజెపి కావాలనే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, దానికి వేరే ఇతర రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని టిడిపి ఇప్పటికే అనుమానిస్తోంది. చౌదరి వ్యాఖ్యలు కూడా దానికి అద్దం పడుతున్నాయి. ఈ వివాదం సద్దుమణుగుతుందో... చిచ్చు రేపుతుందో చూడాలి.
Tags:    

Similar News