తెలుగు ప్రజలు అలెర్ట్ గా ఉండాల్సిన సమయమిది

Update: 2016-04-05 06:39 GMT
సూరీడికి కోపం వచ్చేసింది. తన తీక్షణ వీక్షణాలతో వణుకు పుట్టిస్తున్న భానుడి ప్రతాపంతో తెలుగు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఠారెత్తిస్తున్న ఎండల కారణంగా సగటు జీవి హడలిపోతున్న పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ తొలి వారంలోనే 40 ప్లస్ దాటేసి.. కొన్నిచోట్ల 44 డిగ్రీలు టచ్ అవుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా మండుతున్న ఎండలతో ఎండ తీవ్రత కారణంగా పెద్ద ఎత్తున మరణాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన పగటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో వాతావరణ శాఖాధికారులు కీలక హెచ్చరిక ఒకటి చేశారు. ఎండ తీవ్రత భారీగా ఉన్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మరీ అవసరమైతే తప్పించి బయటకు వెళ్లద్దని సూచిస్తున్నారు.

మరీ ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. వీలైనంతవరకూ బయట పనులు పెట్టుకోవద్దంటున్నారు. ఉదయాన్నే పని పూర్తి చేసుకోవటం లేదంటే.. సాయంత్రం పనులు పెట్టుకోవాలే తప్పించి.. మధ్యాహ్న వేళ వీలైనంత వరకూ బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. వేడి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు అవసరమన్న సంగతి మర్చిపోకూడదు.      ​
Tags:    

Similar News