తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌గా సునీల్‌ బన్సాల్‌.. ఎవరీ బన్సాల్‌!

Update: 2022-08-10 13:06 GMT
2023 ఎన్నికలకు ముందు కొన్ని కీలకమైన సంస్థాగత మార్పులు చేస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా సునీల్‌ బన్సాల్‌ను నియమించింది. అంతేకాకుండా ఆయనకు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల బాధ్యతలను కూడా అప్పగించింది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో ఎక్కువ సీట్లు సాధించి, తెలంగాణ, ఒడిశాలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సునీల్‌ బన్సాల్‌కు ఆ రాష్ట్రాల బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు ఇచ్చింది.

సునీల్‌ బన్సాల్‌ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ సెక్రటరీగా ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ రెండోసారి ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి రావడంలో సునీల్‌ బన్సాల్‌ కీలకపాత్ర పోషించారని చెబుతున్నారు.

అదేవిధంగా ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ కార్యదర్శిగా ఉన్న సునీల్‌ బన్సాల్‌కు తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ బాధ్యతలు అప్పగించడంతో ధరంపాల్‌ను ఉత్తర ప్రదేశ్‌ పార్టీ కార్యదర్శిగా నియమించారు. జార్ఖండ్‌లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా కరమ్‌వీర్‌ను నియమించారు.

కాగా సునీల్‌ బన్సాల్‌ 1969 రాజస్థాన్‌లో జన్మించారు. మొదట బీజేపీ అనుబంధ విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ)లో జాతీయ స్థాయి కమిటీలో పనిచేశారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి బీజేపీలో చేరారు.

కేంద్ర హోం శాఖ మంత్రికి అత్యంత సన్నిహితుడు.. బన్సాల్‌. 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు. కాగా ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్‌గా తరుణ్‌ చుగ్‌ ఉన్న సంగతి తెలిసిందే.
Tags:    

Similar News