సుప్రీం క్వ‌శ్చ‌న్: ప‌్ర‌ధాని ఓపెన్ చేసే వ‌ర‌కూ ఆగాలా?

Update: 2018-05-11 04:34 GMT
దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఒక‌టి చేసింది. ప్ర‌జ‌ల అవ‌స‌రాల కోసం.. ఢిల్లీ ట్రాఫిక్ తీవ్ర‌త‌ను త‌గ్గించేందుకు వీలుగా చేప‌ట్టిన ప్రాజెక్టు ఒక‌టి పూర్తి అయిన‌ప్ప‌టికీ ప్ర‌ధాన‌మంత్రి ప్రారంభించ‌లేద‌ని.. ప్ర‌జ‌లు వాడేందుకు అనుమ‌తి ఇవ్వ‌ని వైనంపై సుప్రీం రియాక్ట్ అయ్యింది.

ప్ర‌ధాని ప్రారంభించే వ‌ర‌కూ దాన్ని ప్ర‌జ‌లకు అందుబాటులోకి తీసుకురారా?  అంటూ సూటిగా అడిగేసిన సుప్రీం.. ఆస‌క్తిక‌ర ఆదేశాల్ని జారీ చేసింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ట్రాఫిక్ క‌ష్టాల గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఢిల్లీ వాసుల క‌ష్టాల్ని త‌గ్గించేందుకు వీలుగా భార‌త జాతీయ ర‌హ‌దారుల సంస్థ ఈస్ట‌ర్న్ పెరిఫెర‌ల్ ఎక్స్ ప్రెస్ వేను రూపొందించింది. అయితే.. దీన్ని ప్ర‌ధాని మోడీ చేత ఓపెన్ చేయాల‌ని భావించారు.

ఇటీవ‌ల క‌ర్ణాట‌క రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఫుల్ బిజీగా ఉండ‌టంతో ఆయ‌నీ ప్రాజెక్టును ఓపెన్ చేయ‌లేదు. దీంతో..  ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రాకుండా ఆగిపోయింది. ఈ వ్య‌వ‌హారం తాజాగా కోర్టు దృష్టికి వెళ్లింది. ఈ ఉదంతంపై విచారించిన సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌ధాని వ‌చ్చి ఓపెన్ చేసే వ‌ర‌కూ దాన్ని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురాకుంటే ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటార‌ని పేర్కొంది.

ఈ నెల 31 లోపు ప్ర‌ధాని ప్రారంభించినా.. ప్రారంభించ‌కున్నా జూన్ ఒక‌టి నుంచి ఈ రోడ్డు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రావాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఈ రోడ్డు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌స్తే ట్రాఫిక్ ఒత్తిడి త‌గ్గిపోవ‌టంతో పాటు.. కాలుష్య తీవ్ర‌త‌ను త‌గ్గించే వీలుంద‌ని కోర్టు పేర్కొంది. మ‌రి.. సుప్రీం ఆదేశాల నేప‌థ్యంలో ప్ర‌ధాని చేత వెనువెంట‌నే ఓపెనింగ్ కార్య‌క్ర‌మం పెడ‌తారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News