తెలుగోళ్ల‌కు శుభ‌వార్త‌..సుప్రీం తీర్పులు ఇట్టే చ‌దివేయొచ్చు!

Update: 2019-07-04 05:55 GMT
కోట్లాది మంది తెలుగోళ్లు ఉన్నా.. తెలుగు భాష‌కు ద‌క్కాల్సిన గుర్తింపు..ఇవ్వాల్సినంత ప్రాధాన్య‌త ఇవ్వ‌లేద‌నే చెప్పాలి. ఇక‌.. తెలుగోళ్లు ఏ రంగంలో ఉన్నా.. వారెంత ఎత్తుకు ఎదిగినా పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాతులు రావ‌న్న వాద‌న త‌ర‌చూ వినిపిస్తూ ఉంటుంది. ఫ‌లానా ప్ర‌ముఖుడు తెలుగోడిగా పుట్టి ఉండ‌క‌పోతేనా.. అత‌గాడి కీర్తి ప్ర‌తిష్ఠ‌లు మ‌రో స్థాయిలో ఉండేవ‌న్న మాట వినిపిస్తోంది.ఇలా.. తెలుగు భాష‌కు.. తెలుగు ప్ర‌జ‌ల విష‌యంలో నిలువెత్తు నిర్ల‌క్ష్యం కొన‌సాగుతుంద‌న్న ఆరోప‌ణ ఉంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తీసుకున్న నిర్ణ‌యం మాత్రం తెలుగోళ్ల‌కు శుభ‌వార్త‌గా చెప్పాలి. వారి ఇబ్బందిని గుర్తించి.. వారికి క‌లుగుతున్న అసౌక‌ర్యాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం సుప్రీంకోర్టులో మొద‌లైంది. ఇక‌పై సుప్రీంతీర్పు కాపీల్ని తెలుగులో కూడా చ‌దువుకునే ఏర్పాటు చేస్తున్నారు. దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం తీర్పు కాపీల్ని ప్రాంతీయ భాష‌ల్లో కూడా అందుబాటులో ఉంచాలంటూ రాష్ట్రప‌తి రామ్ నాథ్ కోవింద్ చేసిన సూచ‌న ఈ నెలాఖ‌రు నుంచి అమ‌ల్లోకి రానుంది.

దీంతో.. సుప్రీంకోర్టు తీర్పులు తెలుగులో కూడా ఇవ్వ‌నున్నారు. తీర్పుల్ని తెలుగులోకి అనువాదం చేయ‌టానికి వీలుగా సాఫ్ట్ వేర్ ను సుప్రీంకోర్టు అభివృద్ధి చేస్తోంది. ఇదే విష‌యాన్ని ఇటీవ‌ల ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగొయి కూడా వెల్ల‌డించారు.

కాక‌పోతే ఒక్క‌టే ఒక్క ఇబ్బంది. సుప్రీంతీర్పుల్ని ఇంగ్లిషులో ఏ రోజుకు  ఆ రోజే వెబ్ సైట్ లో ఉంచేస్తారు. కాకుంటే.. తెలుగులో తీర్పులు మాత్రం క‌నీసం వారం రోజుల ఆల‌స్యంగా పెట్ట‌నున్నారు. తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌కారం తీర్పుల్ని తెలుగుతో పాటు హిందీ.. క‌న్న‌డ‌.. మ‌రాఠీ.. అస్సామీ.. ఒడియా భాష‌ల్లో కూడా అనువాదం ఇవ్వ‌నున్నారు. తెలుగోళ్ల‌కు ఈ నిర్ణ‌యం అంతో ఇంతో మేలు చేస్తుంద‌న‌టంలో సందేహం లేదు.
Tags:    

Similar News