విప‌క్షాల‌కు షాకిస్తూ.. నిమిషంలో తేల్చేసిన సుప్రీం!

Update: 2019-05-07 06:42 GMT
విప‌క్షాల‌కు భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు విష‌యంపై సుప్రీం మీద పెట్టుకున్న ఆశ‌లు అడియాశ‌లు అయ్యేలా తాజా నిర్ణ‌యం వెలువ‌డింది. వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను 50 శాతం లెక్కించాలంటూ 21 విప‌క్ష పార్టీలు పెట్టుకున్న రివ్యూ పిటిష‌న్ పై విచార‌ణ‌కు ఓకే అన్న సుప్రీం.. తాజాగా ఈ విష‌యంలో పాత విధానాన్నే అమ‌లు చేయాల‌ని తేలుస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

గ‌తంలో ఇచ్చిన ఆదేశాల్ని మార్చే ఉద్దేశం లేద‌న్న సుప్రీం కోర్టు.. 5 శాతం వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను మాత్ర‌మే లెక్కించాల‌ని నిర్ణ‌యించ‌టం తెలిసిందే. 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పుల‌ను లెక్కించాలంటే వారం రోజులు ప‌డుతుంద‌ని ఎన్నిక‌ల సంఘం చెప్పిన నేప‌థ్యంలో.. మొత్తం వీవీ ప్యాట్ల‌లో 5 శాతం ఓట్ల‌ను లెక్కించాల‌ని గ‌తంలో నిర్ణ‌యం తీసుకున్నారు.

తాజాగా.. పాత విధానాన్నే అమ‌లు చేయాల‌ని చెప్పిన సుప్రీం.. త‌న విచార‌ణ‌ను కేవ‌లం నిమిషం వ్య‌వ‌ధిలో ముగించటం గ‌మ‌నార్హం. ఈ అంశంపై ఏపీ ముఖ్య‌మంత్రి.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో స‌హా 21 విప‌క్ష పార్టీలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేశాయి.  వీవీ ప్యాట్ చిటీల లెక్కింపు ఒక‌టి నుంచి ఐదుకు చేయ‌టం స‌హేతుక‌మైన సంఖ్య కాద‌ని.. అది సంతృప్తి క‌లిగించేదీ లేద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు త‌మ రివ్యూ పిటిష‌న్ లో పేర్కొన‌గా.. ఈ అంశంలో మేమిచ్చిన తీర్పును స‌వ‌రించేందుకు ఆస‌క్తిగా లేము అని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ రంజ‌న్ గొగోయ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం తేల్చేసింది. దీంతో.. ఈ విష‌యంలో సుప్రీం తీర్పు 21 పార్టీల‌కు భారీ ఎదురుదెబ్బ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.  


Tags:    

Similar News