నేర రాజకీయాలపై కేంద్రాన్ని దులిపేసిన సుప్రీం.. సంచలన వ్యాఖ్యలివే

Update: 2021-08-11 05:11 GMT
మాటల్లో వినిపించే స్వచ్ఛ రాజకీయం చేతలకు వచ్చేసరికి మాత్రం అలాంటిదేమీ కనిపించదు. అధికారానికి దూరంగా ఉన్నప్పుడు చెప్పే మాటలు.. ధర్మాలు.. నీతిసూత్రాలు.. చేతికి పవర్ వచ్చిన తర్వాత పత్తా లేకుండా పోతాయి. అధికారంలో ఎవరున్నాసరే.. దాన్ని కాపాడుకోవటం.. రాజకీయ ప్రత్యర్థుల అంతు చూడటమే తప్పించి.. దేశం.. దేశ ప్రయోజనాలు.. రాజకీయ వ్యవస్థను మరింతగా చక్కదిద్దుకోవటం లాంటి వాటి గురించి ఆలోంచిన దాఖలాలు కనిపించవు. నీతివంతుడైన మౌన ప్రధాని అధికారంలో ఉన్నప్పుడు.. నోరు తెరిస్తే వ్యక్తిత్వ వికాశ నిపుణుడిగా మాట్లాడే ప్రధాని అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లోనూ.. రాజకీయ పార్టీల్లో మార్పులు తెచ్చే నిర్ణయాల్ని మాత్రం తీసుకోవటానికి ఇష్టపడని వైనం కనిపిస్తుంది.

ఇలాంటివేళ.. ఆ బాధ్యతను తీసుకున్నట్లుగా కనిపిస్తోంది సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల్ని చూస్తుంటే. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ వినీత్ శరణ్..జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధులపై దాఖలైన క్రిమినల్ కేసుల విచారణను వేగం చేయాలని.. వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాలం నిషేధం విధించాలని కోరుతూ బీజేపీ నేత కమ్ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ 2016లో దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేయటమే కాదు.. కేంద్రం తీరును సూటిగా తప్పు పట్టేందుకు వెనుకాడలేదు. అంతేకాదు.. వ్యవస్థలో మార్పుల కోసం అధికారంలో ఉన్నవారు ఏమేం చేయాలన్న విషయాన్ని చెప్పేసింది.

ఇటీవల కాలంలో ఒక కేసు విచారణ సందర్భంగా వ్యవస్థలోని లోపాలు.. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనుల మీద ఇంత సూటిగా మాట్లాడిన సందర్భం లేదనే చెప్పాలి. ఘాటు విమర్శలతో సరిపుచ్చకుండా.. సమస్య పరిష్కార మార్గాలతో పాటు.. పలు కీలక ఆదేశాల్నిజారీ చేయటం గమనార్హం. మాజీ, ప్రస్తుత ప్రజా ప్రతినిధులపై దాఖలైన కేసులకు సంబంధించిన సమగ్ర వివరాలు సమర్పించేందుకు కేంద్రానికి ఆఖరి అవకాశంగా... రెండు వారాలు గడువు ఇచ్చిన ధర్మాసనం.. ఈ నెల 25 నాటికి కేసుల నెంబర్లు.. పెండింగ్ కేసులు.. అవి ఏ దశలో ఉన్నాయన్న సమగ్ర వివరాల్ని నివేదిక రూపంలో సమర్పించాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రజాప్రతినిధులపై కేసుల్లో సాక్షుల విచారణకు ప్రత్యేక కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్‌ సౌకర్యం సమకూర్చడంతో పాటు.. నిధుల విడుదలపై కేంద్రం కూడా సమగ్ర సమాధానమివ్వాలని చెప్పింది. ఇలా పెను సంచలనంగా మారిన ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు.. వెలువరించిన ఆదేశాల్లోని కీలకాంశాల్ని చూస్తే..

- ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తొలుత భావించాం. కానీ... ఆ దిశగా ప్రభుత్వం వైపు నుంచి ఏమీ జరగడంలేదు. నేతలపై కేసుల విచారణ వేగవంతానికి.. వాటిపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టులో ప్రత్యేక ధర్మాసనం అవసరమని భావిస్తున్నాం.
- పెండింగ్‌ కేసులపై స్థాయీనివేదికలు సమగ్రంగా సమర్పించాలన్న ఆదేశాలను సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు పాటించకపోవటం ఏమిటి? ఆయా నివేదికలు కోర్టు ముందుకు రాక ముందే లీక్‌ కావడం ఏమిటి? ఇటీవల ఈడీ సమర్పించిన నివేదికలో కోర్టు అడిగిన సమాచారం ఏమీ లేదు. కొందరు రాజకీయ నేతల పేర్లు మాత్రమే అందులో ఉన్నాయి.

- పలు దఫాలు అసంతృప్తి వ్యక్తంచేసినా.. మీ వైపు నుంచి ఏమీ జరగడం లేదు. ఇంతకుమించి మేమేమీ చెప్పలేం. మీరు అర్థం చేసుకోవాలి. విచారణ ప్రారంభమైన మొదట్లో.. ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మేం అనుకున్నాం. కానీ, అలా జరగడం లేదు.ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్‌ కేసులను ఎడాపెడా ఎత్తివేయడం కుదరదు.

- హైకోర్టు అనుమతి తీసుకున్న తర్వాతే కేసుల ఎత్తివేతపై నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు.. అసిస్టెంట్ పీపీల అధికారులు గతంలో మాదిరి వ్యవహరించలేరు. ఈ కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తులను తదుపరి ఆదేశాలిచ్చేవరకు బదిలీ చేయడానికి వీల్లేదు.

- సీఆర్‌పీసీ 321 సెక్షన్‌ కింద సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పీపీలు/ఏపీపీలు నేతలపై కేసులను ఉపసంహరించుకుంటున్న వైనాన్ని అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా ధర్మాసనం దృష్టికి తీసుకురాగా.. ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. సీఆర్‌పీసీ 321 సెక్షన్‌ కింద అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునే దిశగా ఆదేశాల్ని జారీ చేసింది.

- హైకోర్టు అనుమతి లేకుండా ఏ ఎంపీ/ఎమ్మెల్యేపైనా ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించరాదని స్పష్టంచేసింది. అలాగే ప్రజాప్రతినిధుల కేసులను విచారిస్తున్న ప్రత్యేక కోర్టుల న్యాయమూర్తులను బదిలీ చేయకూడదు. ఒకవేళ వారిలో ఎవరైనా చనిపోయానా.. రిటైర్ అయితే మాత్రం మినహాయింపు ఉంటుంది. అప్పుడు మా ఆదేశాలు వర్తించవు.

- రాజకీయాలను నేరరహితం చేయాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా.. రాజకీయ పార్టీలు మొద్దు నిద్ర వీడడం లేదు.

- నేర చరితులకు చట్టసభల్లో చోటు ఉండొద్దు. నేరమయ రాజకీయాలకు కాలం చెల్లుతుందని ఎదురు చూసి, చూసి జనం విసిగి పోతున్నారు. వారిలో సహనం నశిస్తోంది. రాజకీయాల్లో ప్రక్షాళన జరగాల్సిందే. ఇది చట్టసభల తక్షణ కర్తవ్యం.

- దేశంలో నేరమయ రాజకీయాల జాఢ్యం నానాటికీ పెరుగుతోంది. ఈ విషయంలో ఏం చెప్పినా, ఎంత చెప్పినా రాజకీయ పార్టీల వైఖరి చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగానే ఉంది. ఈ విషయంలో అత్యవసరంగా ఏదో ఒకటి చేయాలని న్యాయ వ్యవస్థ భావిస్తోంది. అయితే... శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాల అధికారాలను రాజ్యాంగం నిర్వచించింది. అందుకే, మా చేతులు కట్టేసినట్లయింది. అందుకే.. నేరమయ రాజకీయాల కట్టడికి ఇకనైనా చర్యలు తీసుకోవాలని చట్టసభల సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వ్యవస్థకు ‘భారీ సర్జరీ’ చేయాలని కూడా సూచిస్తున్నాం.


Tags:    

Similar News