ఇద్దరికీ త‌లంటిన ఎర్రన్న

Update: 2015-04-03 04:29 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబు వ‌ల్లే స‌మ‌స్యలు వస్తున్నాయని ఇటీవ‌లే సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత‌లు చేప‌ట్టిన‌ తెలుగుబిడ్డ సుర‌వ‌రం సుధాక‌ర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. త‌న మొద‌టి విలేక‌రుల స‌మావేశంలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సుర‌వ‌రం తలంటారు. ఈ రెండు రాష్ర్టాల మధ్య సమైక్య వాతావరణం ఏర్పడకుండా ముఖ్యమంత్రులు రెచ్చగొడుతూ ప‌బ్బం గ‌డుపుకొంటున్నార‌ని మండిప‌డ్డారు.
 
ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో చంద్రబాబు, కేసీఆర్ రాజకీయ అవకాశవాదంతో పరస్పరం రెచ్చగొడుతూ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. రాజధానికి వచ్చే వాహనాలపై ప్రవేశపన్ను విధించడం బాధ్యతారాహిత్యమైన చర్య అని, ఈ నిర్ణయాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని అన్నారు. ఢిల్లీలో సురవరం విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ శక్తిపై బాబు వైఖరితో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, ఉమ్మడి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోకుండా హైదరాబాద్‌లో ఉన్నవన్నీ మావేనంటున్న కేసీఆర్ ధోరణితో చిక్కులొస్తున్నాయని కుండ‌బ‌ద్దలు కొట్టారు. ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలిచ్చి, అమలులో విఫలమై ప్రజల దృష్టి మళ్లించడానికి అనవసరమైన చిక్కులు తెస్తున్నార‌ని మండిప‌డ్డారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, తెలంగాణలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి ఆర్థిక సహాయాన్ని అందచేయాలని కేంద్రాన్ని కోరారు. ఢిల్లీ పెద్దలు సైతం తెలుగు రాష్ర్టాల ప్రయోజ‌నాల‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టక‌పోవ‌డం వ‌ల్ల ఏపీ, తెలంగాణ‌ల్లోని ప‌లు స‌మ‌స్యలు ఏర్పడుతున్నాయని మండిప‌డ్డారు. ఆఖ‌రికీ రొటీన్‌గా..  రాబోయే కాలంలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కోడానికి వామపక్షాల ఐక్యకూటమితో పోరాటాలకు కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు.
Tags:    

Similar News