హోదా గ‌ల్లంతైన‌ట్లే బాబు కూడా అవుతారు

Update: 2017-02-12 09:14 GMT
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్తున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముగిసిన అధ్యాయమేనని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ నిరాకరించడంతో హోదా ఉద్యమాన్ని నీరుగార్చడానికి 14వ ఆర్థిక సంఘం నో చెప్పిందని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనిపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతపురం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి మాట్లాడారు. ప్రధాని మోడీ పేదల పక్షమని చెప్పుకుంటూ కార్పొరేట్, ధనికవర్గాలకు వత్తాసు పలుకుతున్నారని విమ‌ర్శించారు. పేద‌ల ప్ర‌భుత్వం అంటూ దేశ ప్రజలను మోసం చేస్తున్నారని బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రధాని వైఖరి తేటతెల్లమైందన్నారు. పేద ప్రజల అభ్యున్నతి, సంక్షేమానికి నిధుల కేటాయింపులు తగ్గిపోతున్నాయని అసంఘటిత కూలీలకు ఉపాధి కల్పించే ఎన్‌ఆర్‌ఈజిపికి గతంలో కంటే 0.9 శాతం నిధులు పెంచి పెద్దఎత్తున నిధులు కేటాయించామని ఆర్థికమంత్రి జైట్లీ గొప్పలు చెప్పుకుంటున్నారని సుధాక‌ర్ రెడ్డి అన్నారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ పాలనలో సంపద కొంతమంది చేతుల్లోనే ఎక్కువగా కేంద్రీకృతమవుతోందని సుర‌వ‌ర ఆరోపించారు. పెద్దనోట్లు రద్దు చేసి ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారని సురవరం ధ్వజమెత్తారు. నల్లధనం వెలికితతకు నోట్లు రద్దు చేశామని చెప్పిన ప్రధాని రూ.2 వేల నోటు ముద్రణపై నోరు మెదపడం లేదన్నారు. పెద్దనోట్లను బ్యాంకుల్లో జమ చేయడానికి డిసెంబర్ 31తో గడువు ముగిసినా నేటికీ బ్యాంకుల్లో ఎంత డబ్బు జమ అయింది చెప్పడం లేదన్నారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రధాని స్థాయికి తగినట్లు కాకుండా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను అపహాస్యం చేస్తూ దిగజారి మాట్లాడారని విమ‌ర్శించారు. తమిళనాడు రాజకీయాలపై స్పందిస్తూ 'కల్లోల జలాల్లో చేపలవేట సాగించినట్టు'గా తమిళనాడు వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రమేయముందని సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి ఆదేశాల మేరకు తమిళనాడు గవర్నర్‌ వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాజభవన్‌ ఆధారంగానే రాజకీయ కుట్ర సాగుతోందన్నారు. రాజీనామాను ఆమోదించానని చెప్పిన గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఎందుకు సహకరించడం లేదో చెప్పాల్సిన అవసరముందని అన్నారు. ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు ఇది మంచిది కాదని హితవు పలికారు. అన్నాడీఎంకేలో చీలిక తెచ్చి అనిశ్చిత పరిస్థితి తీసుకువచ్చి తమకు అనుకూలమైన వారికి సీఎం పదవి కట్టబెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సుర‌వ‌రం ఆరోపించారు. అలా కుదరకపోతే రాష్టప్రతి పాలన విధించాలని ప్రయత్నిస్తోందని, అందుకే తమిళనాడులో ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడాలని సురవ‌రం డిమాండ్ చేశారు.
Tags:    

Similar News