ట్వీట్ ప్ర‌భు కావ‌టానికి ఆయ‌నేం చేశారంటే?

Update: 2016-02-19 11:30 GMT
ట్విట్ట‌ర్ లో ఒక్క ట్వీట్ పోస్ట్ చేస్తే చాలు.. అంత పెద్ద రైల్వేశాఖ‌లో క్ష‌ణాల్లో క‌ద‌లిక‌. దేశం మొత్త‌మ్మీదా రైల్వేల‌కు సంబంధించి ఎక్క‌డేం జ‌రిగినా స‌రే.. ఇట్టే స్పందించ‌ట‌మే కాదు.. సాయం చేయ‌టానికి రైల్వేశాఖ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇప్పుడు అంద‌రి మ‌న‌సుల్ని దోచుకుంటున్నాయి. ఆక‌లితో ఇబ్బంది ప‌డే విద్యార్థుల‌కు ఫుడ్ కావొచ్చు.. రైల్లో ప్ర‌యాణిస్తూ అనారోగ్యానికి గురైతే క్ష‌ణాల్లో వైద్య సాయం కావొచ్చు.. ఇలా ఒక‌టికాదు రెండు కాదు.. ఏ వేళ‌లో అయినా సాయం కోసం ట్వీట్ చేస్తే చాలు.. మొత్తం రైల్వే వ్య‌వ‌స్థే ఎలా క‌దులుతోందన్న‌ది ఇప్పుడు అంద‌రి మ‌దిని తొలిచే పెద్ద ప్ర‌శ్న‌.

కేంద్ర రైల్వే మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన కొద్దికాలానికే త‌న మార్క్ చూపించిన సురేశ్ ప్ర‌భు.. త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో  సాయం కోసం ట్వీట్ చేసే వారికి సాయం అందించేందుకు పెద్ద సెట‌ప్ సెట్ చేశారు. దీని కోసం ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌నే రూపొందించారు. అదే.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా రైళ్ల‌ల్లో ప్ర‌యాణించే ప్ర‌యాణికుల‌కు పెద్ద అండ‌గా మారింది.

ఢిల్లీలోని రైల్వే మంత్రిత్వ శాఖా కార్యాల‌యంలోని నాలుగో అంత‌స్తులోని నెంబ‌ర్ 454 గ‌దిలో ట్విట్ట‌ర్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. ఈ వ్య‌వ‌స్థ‌ ప‌ర్య‌వేక్షణ బాధ్య‌త‌ల్ని ముగ్గురు అధికారులకు అప్ప‌గించారు. ఆ ముగ్గురు అధికారులు ఎవ‌రంటే.. ఒక‌రు అనంత్ స్వ‌రూప్‌.. మ‌రొక‌రు హ‌సీన్ యాద‌వ్‌.. మూడో వ్య‌క్తి వేద్ ప్ర‌కాశ్‌. ఈ ముగ్గురు నిత్యం చురుగ్గా ఉంటూ రైల్వే ప్ర‌యాణికులు పోస్ట్ చేసే ట్వీట్‌ ల‌ను ప‌ర్య‌వేక్షిస్తుంటారు. ఎవ‌రికి ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా..ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన నిమిషాల వ్య‌వ‌ధిలో స్పందించే ఏర్పాటు చేశారు.

ఉద‌యం ఆరు గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కూ.. మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల నుంచి రాత్రి ప‌ది గంట‌ల వ‌ర‌కూ.. రాత్రి ప‌ది నుంచి ఉద‌యం ఆరు గంట‌ల వ‌ర‌కూ ఈ ముగ్గురు అధికారులు రైల్వే మంత్రి ట్విట్ట‌ర్ ఖాతాను ప‌ర్య‌వేక్షిస్తుంటారు. ఎవ‌రైనా ట్వీట్ చేసిన వెంట‌నే.. ఐదు నిమిషాల వ్య‌వ‌ధిలో వారికి అవ‌స‌ర‌మైన సాయాన్ని అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తారు.

ఒక అంచ‌నా ప్ర‌కారం రోజుకు రైల్వే మంత్రి ట్విట్ట‌ర్ అకౌంట్‌ కి 5వేల ట్వీట్లు వ‌స్తాయి. వీటిల్లో 30 శాతం రీట్వీట్లు ఉంటాయి. 20 నుంచి 30 శాతం వ‌ర‌కూ కామెంట్లు ఉంటే.. మిగిలిన వాటికి స్పందించాల్సి ఉంటుంది. అలాంటి వాటి విష‌యంలో ఆయా విభాగాల వారిని అలెర్ట్ చేసి సాయం అందేలా చేస్తారు. ఇప్ప‌టివ‌ర‌కూ 7.75 లక్ష‌ల ట్వీట్లు వ‌చ్చిన‌ట్లు అధికారులు చెబుతారు. ఇంత సెట‌ప్ చేయ‌టం వ‌ల్లే కేంద్ర‌మంత్రి సురేశ్ ప్ర‌భు కాస్తా ట్విట్ట‌ర్ ప్ర‌భుగా మార‌ట‌మే కాదు.. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ రైల్వే మంత్రికి ల‌భించ‌ని ఇమేజ్ సొంత‌మైంద‌ని చెప్పొచ్చు.
Tags:    

Similar News