నాకు ఓటేస్తే మందుతోపాటు మటన్ ఫ్రీ!

Update: 2018-04-19 04:16 GMT
ఎన్నిక‌ల స‌మ‌యంలో కాస్త వినూత్నంగా ఆలోచించక‌పోతే..ఓట్ల రాల‌వు అనుకున్నాడో ఏమో కానీ...పై ప్ర‌క‌ట‌న చేసేశాడు ఓ నాయ‌కుడు. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా రాజకీయ నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వారికి డబ్బు - మద్యం - దుస్తులు - వస్తువులు ఆశ జూపడం గురించి మనకు తెలుసు. ఈ పద్ధతులన్నీ ఇప్పుడు పాతబడిపోయాయి. కొత్తగా ఆలోచిద్దాం అనుకున్నాడు.. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తున్న సురేశ్. చింతామణి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్న ఆయన పెద్దపెద్ద పార్టీలకు చెందిన ప్రత్యర్థులపై గెలువడానికి కొత్త ఎత్తుగడ వేశారు. అదే మందుతోపాటు మటన్ పంపిణీ పథకం!.. అదేదో మందు - మటన్ ఓసారి ఇవ్వడం కాదు..నెల నెల‌!

`మీరు నాకు ఓటేశారనుకోండి.. ప్రతివారం 600 గ్రాముల మటన్ మీ ఇంటికి పంపిస్తా. 18 ఏళ్లు దాటిన వారికి నెలకోసారి మద్యం కూడా ఉచితంగా ఇస్తా.. మీ అమూల్యమైన ఓటు మాత్రం నాకే వేయండి` అంటూ కరపత్రాలు వేసి మరీ సురేశ్‌ ప్రచారం మొదలు పెట్టారాయన. ఇందులో ఈ అభ్యర్థికి ఒక ఆదర్శం కూడా కనిపించిందట. ఇలా చేయడం వల్ల తన నియోజకవర్గంలో లిక్కర్ మాఫియాకు చెక్ పెట్ట వచ్చునన్నది ఆయన ఆలోచనట. ఆ సంగతి తన మ్యానిఫెస్టోలో వివరించారు. ఈయన వేసిన కరపత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి.

ఇంతేకాకుండా క‌ర్ణాటక ఎన్నిక‌ల్లో మ‌రిన్ని చిత్రాలు కూడా తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓట్ల కోసం కొందరు నేతలు విందులు కూడా ఇస్తుంటారు. అదేదో వారివారి పార్టీ కార్యకర్తలకు ఇచ్చేది కాదు. ఓట్లర్ల కోసం ఇచ్చేది. మాంసాహారులు పెళ్లిళ్ల సీజన్‌లో బంధుమిత్రులకు నాన్‌ వెజ్ వంటకాలతో డిన్నర్లు ఏర్పా టు చేస్తారు. మరి ఆ ఖర్చులను తామే భరిస్తే.. ఆ విందేదో తామే ఇస్తే.. ఆ పెళ్లికి వచ్చే వారంతా తమకే ఓట్లు వేస్తారన్న ఆశతో కొన్ని రాజకీయ పార్టీలు అటువంటి ఏర్పాట్లు చేస్తున్నాయి. పెద్దపెద్ద హోటళ్లలో మటన్ బిర్యానీతో విందులు ఇస్తున్నాయి. ఆలయాల వద్ద ఉత్సవాలు - యక్షగానాలు వంటి కార్యక్రమాల సందర్భంగా కూడా మాంసాహార విందులు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కర్ణాటకలో చికెన్ - మటన్‌ కు విపరీతంగా డిమాండ్ ఏర్పడగా - వాటి రేట్లు పెరుగుతున్నాయి - 2014నాటి సర్వే ప్రకారం కర్ణాటకలో 78.9శాతం మంది మాంసాహారులున్నారట..! అందుకే వారిని ఆక‌ట్టుకునేందుకు ఇదిగో..ఇలాంటి స్కీంలు తెస్తున్నారు నేత‌లు.
Tags:    

Similar News