అరుదైన ఫోటోను షేర్ చేసి సర్ ప్రైజ్ చేసిన దత్తన్న

Update: 2021-06-26 08:30 GMT
తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని రాజకీయ నేతల్లో బండారు దత్తాత్రేయ వేరు. ఆయన పేరు చెప్పినంతనే ఆలయ్.. బలయ్ కార్యక్రమం గుర్తుకు వస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ ప్రోగ్రాంకు అంతో ఇంతో ప్రాతినిధ్యం ఉందని చెప్పాలి. రాజకీయ విభేదాల్ని పక్కన పెట్టి దత్తాత్రేయ నిర్వహించే ఈ కార్యక్రమానికి రాజకీయ నేతలంతా రావటం.. ఆ సందర్భంగా నేతల మధ్య తెలంగాణ అంశం హాట్ హాట్ చర్చలకు కారణమయ్యేది.

సాత్విక రాజకీయ నేతగా కనిపించే దత్తాత్రేయ.. యుక్త వయసులో ఉన్నప్పుడు ఎంత రెబల్ గా ఉండే వారన్న విషయం ఇప్పటి తరానికి అర్థమయ్యేలా ఆయనో ఫోటోను విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధించిన ఇందిరమ్మ హయాంలో.. అందుకు వ్యతిరేకంగా గళం విప్పే సంఘ్ కార్యకర్తల్ని.. నేతల్ని పోలీసులు.. భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని జైలుకు తరలించేవారు. ఈ క్రమంలో వారి కళ్లు గప్పేందుకు ఆయన మారు వేషంలో తిరిగేవారు. పోలీసులకు చిక్కకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా గళం విప్పారు.

దాదాపు తొమ్మిది నెలల పాటు మారు వేషంలో తిరిగిన దత్తాత్రేయను ఎట్టకేలకు బెల్లంపల్లిలో పట్టుకున్న పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఎమర్జెన్సీ వేళ.. తానేం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. మీసా చట్టం కింద అప్పట్లో తనను జైలుకు పంపారన్నారు. ఆ సమయంలోనే తన అన్నయ్య అనారోగ్యంతో మరణించటంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తనను విడుదల చేశారన్నారు.

అయినప్పటికి తన చుట్టూ పాతిక మంది పోలీసులు చుట్టూ ఉండేవారని.. అంత్యక్రియలు ముగిసిన వెంటనే.. అదే రాత్రి తనను జైలుకు తరలించారని చెప్పారు. నెల తర్వాత పెరోల్ మీద బయటకు వచ్చినప్పుడు.. మళ్లీ తప్పు చేయనని రాసిస్తే.. జైలు నుంచి విడుదల చేస్తామని కొందరు చెబితే.. అలా మా అబ్బాయి రాసివ్వడు.. వాడేం తప్పు చేయలేదని తన తల్లి ధైర్యంగా చెప్పినట్లుగా దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. పాత ఫోటోతో కొత్త విషయాల్ని బండారు దత్తాత్రేయ షేర్ చేసుకొన్నారు.
Tags:    

Similar News