కీలక అరెస్ట్, సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చుట్టు బిగుస్తున్న ఉచ్చు

Update: 2020-09-03 07:30 GMT
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు సంబంధించిన కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) అబ్దుల్ బాసిత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఈ అరెస్టుతో సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరింత ఇరకాటంలో పడింది. అబ్దుల్ బాసిత్‌తో రియా సోదరుడికి సంబంధాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ముంబైలోని బాంద్రా నుండి అబ్దుల్ బాసిత్‌ను అరెస్ట్ చేసినట్లు NCB బుధవారం వెల్లడించింది. అతనికి సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరండాతో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. అంతేకాదు, రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ సూచనల మేరకు బాసిత్ నుండి మిరండా డ్రగ్స్ తీసుకునే వాడని తెలిపింది. దీంతో రియాకు ఈ కేసు ఉచ్చు మరింతగా బిగుస్తోంది.

మిరండా గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నివాసంలో హౌస్ కీపింగ్ మేనేజర్‌గా పని చేశాడు. అతనిని రియా చక్రవర్తినే గత ఏడాది మే నెలలో నియమించింది. ఇంటికి సంబంధించిన ఖర్చులు అన్నీ మిరండానే చూసుకునే వాడు. మిరండా పైన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీ సంచలన ఆరోపణలు చేసింది. అతను ఇంటి నుండి డబ్బులు కొల్లగొట్టేవాడని, డ్రగ్స్ సరఫరా చేసేవాడని విమర్శలు గుప్పించింది.

ఈ కేసుకు సంబంధించి అబ్దుల్ బాసిత్‌తో పాటు జైద్ విలాత్రాను కూడా NCB అరెస్టు చేసింది. కాగా, సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఎన్నో ఆశ్చర్యకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. సుశాంత్ కేసుతో సంబంధం ఉన్న యాభై మందికి పైగా విచారించారు ముంబై పోలీసులు. రియా చక్రవర్తి కీలకంగా ఈ కేసులో డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది.
Tags:    

Similar News