దేశ ప్ర‌ధానికే సాయం చేసిన చిన్న‌మ్మ‌

Update: 2017-08-25 07:41 GMT
త‌న‌ను చిన్న‌మ్మ అంటూ అభిమానంతో పిలుచుకునే వారికి మాత్ర‌మే కాదు.. అంద‌రి మ‌న‌సుల్ని త‌న ప‌నితీరుతో దోచేస్తున్నారే కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌. క‌ష్టంలో ఉన్నామంటూ ట్వీట్ చేస్తే చాలు సాయానికి సిద్ధ‌మ‌య్యే సుష్మా స్వ‌రాజ్ ఈసారి ఏకంగా ఒక దేశ ప్ర‌ధానికే సాయం చేసి వార్త‌ల్లోకి వ‌చ్చారు.

విదేశాంగ శాఖ‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి సాయం కోసం అర్థించే వారెవ‌రైనా.. వారి జాతీయ‌త‌ను ప‌క్క‌న పెట్టి మ‌రీ సాయం చేస్తూ స‌రికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకున్న సుష్మా స్వ‌రాజ్ తాజాగా త‌న హోదాను ప‌క్క‌న పెట్టి మ‌రీ హెల్ప్ చేసిన తీరు అంద‌రి ప్ర‌శంస‌ల్ని పొందుతోంది.

తాజాగా భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన నేపాల్ ప్ర‌ధాని షేర్ బ‌హదూర్ దేవుబా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో క‌లిసి హైద‌రాబాద్ హౌస్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో మాట్లాడుతున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి దేవుబా మాట్లాడుతున్న వేళ‌.. ఆయ‌న‌కు పొల మారింది. దీంతో.. ఆయ‌న మాట్లాడ‌లేక‌పోయారు.

గొంతులో నుంచి మాట రాక ఇబ్బంది ప‌డుతున్న వేళ‌.. ఆయ‌న ఇబ్బందిని గుర్తించి క్ష‌ణాల్లో రియాక్ట్ అయ్యారు కేంద్ర‌మంత్రి సుష్మా స్వ‌రాజ్‌. వెంట‌నే స్పందించిన ఆమె.. త‌న ద‌గ్గ‌రున్న వాట‌ర్ బాటిల్ లోని వాట‌ర్ ను గ్లాస్ లో పోసి వేదిక వ‌ద్ద‌కు వెళ్లి ఆయ‌న చేతికి ఇచ్చారు. మంచినీళ్లు తాగిన ఆయ‌న గొంతు స‌వ‌రించుకొని.. సారీ.. గొంతు స‌రిగా లేద‌ని చెప్పారు.

అంతేనా.. మంచినీళ్ల గ్లాస్ ను తానే స్వ‌యంగా అందించిన సుష్మా స్వ‌రాజ్‌.. గ్లాస్ కోసం వేదిక వ‌ద్దే నిలుచుండిపోయారు. అప్ప‌టికి కానీ రియాక్ట్ కాని నేపాల్ ప్ర‌ధాని సిబ్బంది.. వెంట‌నే ప్ర‌ధాని వ‌ద్ద నుంచి నీళ్ల గ్లాసును అందుకున్నారు. అత్యుత్త‌మ ప‌ద‌విలో ఉండి కూడా త‌న‌ను అభిమానంగా పిలుచుకునే చిన్న‌మ్మ పాత్ర‌ను పోషించిన వైనం చూసిన వారంతా సుష్మ‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. చిన్న‌మ్మ చిన్నమ్మే.
Tags:    

Similar News