స్వామీజీ నోట ఇలాంటి మాటలా?

Update: 2018-11-27 07:37 GMT
సన్యాసులుగా మారి.. స్వామీజీల అవతారం ఎత్తిన వాళ్లు సున్నితంగా ఉంటారు. కరకు మాటలు వాడరు. భాష విషయంలో చాలా జాగ్రత్త పడతారు. అందులోనూ జనాల్లోకి వచ్చినపుడు మరింత జాగ్రత్త పడతారు. కానీ ఈ మధ్య ఆధ్యాత్మిక కార్యకలాపాల కంటే రాజకీయాల్లో చాలా బిజీగా కనిపిస్తున్న స్వామి పరిపూర్ణానంద మాత్రం తాను ఒక స్వామీజీనే విషయాన్నే మరిచిపోతున్నట్లున్నారు. దక్షిణాదిన స్వామీజీలు రాజకీయ ప్రచారం చేయడమే అరుదు అంటే.. ఆయన ప్రచారానికి వచ్చి సగటు రాజకీయ నాయకుల భాషను వినియోగిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ ఖతం కావడం.. ఎంఐఎం పార్టీ హతం కావడం తథ్యమని ఆయన శాపనార్థాలు పెట్టారు పరిపూర్ణానంద. స్వామీజీ నోటి నుంచి ఖతం.. హతం లాంటి మాటలు రావడంతో జనాలు ఆశ్చర్యపోయారు.

మలక్ పేట బీజేపీ అభ్యర్థి ఆలె జితేంద్రకు మద్దతుగా మూసారాంబాగ్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా మోడీ పట్ల వ్యతిరేకత పెరుగుతూ.. దక్షిణాదిన అది తీవ్ర స్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఆయనపై పరిపూర్ణానంద ప్రశంసలు కురిపించేశారు. ఆయన్ని మించి పాలకుడు లేడన్నట్లుగా మాట్లాడారు. మోదీ పాలనలో దేశంలో ఎక్కడా బాంబు పేలుళ్లు జరగలేదని అన్నారు. ఇక తెలంగాణలో ఉనికి చాటుకోవడానికి అవస్థలు పడుతున్న బీజేపీ.. ఏకంగా అధికారంలోకి వచ్చేస్తుందన్నట్లు పరిపూర్ణానంద మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరుని భాగ్యనగరంగా మార్చేస్తామని కూడా ఆయన సెలవిచ్చారు. హిందూత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న అక్బరుద్దీన్ - పాకిస్తాన్ కు పోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ కు ఓటేస్తే నేరుగా మజ్లిస్ కి ఓటేసినట్టే అని ఆయనన్నారు.


Tags:    

Similar News