భైర‌వి పూజ ఎపిసోడ్ లో షాకింగ్ గా ఇద్దరి వ్యాఖ్య‌లు

Update: 2018-01-04 07:29 GMT
ఒక విష‌యం మీద ఏ ఇద్ద‌రు స్వాములు ఒక‌లా ఆలోచించ‌రే అంటూ కొంద‌రు ఎట‌కారం చేసుకుంటుంటారు. ఇప్పుడు బెజ‌వాడ దుర్గ‌మ్మ గుడిలో అర్థ‌రాత్రి వేళ జ‌రిగిన‌ట్లుగా చెబుతున్న భైర‌వీ పూజ విష‌యం ఇరు రాష్ట్రాల్లోని తెలుగు ప్ర‌జ‌ల‌కు షాకింగ్ గా మారింది. భైర‌వి పూజ జ‌రిగింద‌ని కొంద‌రు.. లేదు లేదు అని మ‌రికొంద‌రు వాదిస్తున్నారు.

జ‌రిగింద‌ని పాల‌క మండ‌లి అధ్య‌క్షుడు చెబుతుంటే.. దేవాదాయ శాఖ అధికారులు అలాంటిదేమీ లేద‌ని వాదిస్తున్నారు. భైర‌వీ పూజ జ‌రిగిందా?  లేదా? అన్న‌ది కాసేపు ప‌క్క‌న పెడితే.. అర్థ‌రాత్రి వేళ‌.. ఏదో జ‌రిగింద‌న్న‌ది మాత్రం నిజం.

అయితే.. దీనికి కొంద‌రు అలంకారం కోస‌మ‌ని చెబితే.. మ‌రికొంద‌రు శుద్దికోస‌మ‌ని చెబుతున్నారు. అన్నేసి గంట‌ల పాటు.. అది కూడా రాత్రివేళ గుడి మూసిన త‌ర్వాత చేస్తారా? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం దొర‌క‌ని ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. తాను మాత్రం త‌క్కువ తిన‌లేద‌న్న‌ట్లుగా ఏపీ దేవాదాయ శాఖ‌మంత్రి మాణిక్యాల‌రావు చెప్పిన మాట‌లు ఇప్ప‌డు మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారాయి. రాష్ట్రప‌తి కోవింద్ స‌తీమ‌ణి వ‌స్తున్నారని .. ప్ర‌త్యేకంగా అలంకర‌ణ చేయించామ‌ని అందుకే అర్థ‌రాత్రి వేళ అలా చేయాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు.

ఎవ‌రైనా ప‌వ‌ళింపు సేవ అయ్యాక అలంకారం చేస్తారా? అన్న‌ది పూజ‌ల మీద కాస్త అవ‌గాహ‌న ఉంటే అర్థ‌మ‌వుతుంది. అయినా.. అర్థ‌రాత్రి వేళ అలంకారం చేసి.. మ‌ళ్లీ ఉద‌యం సుప్ర‌భాతం చేస్తారా. అంటే.. అలంకారం మార్చారా? అన్న లాజిక్కుకు స‌మాధానం ల‌భించ‌ని ప‌రిస్థితి.

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. ప్ర‌భుత్వ పెద్ద‌లు.. దేవాదాయ శాఖాధికారులు చెబుతున్న‌ట్లుగా అస‌లేం జ‌ర‌గ‌లేద‌న్న‌ది నిజ‌మే అయితే.. అధికారి మీద చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు ఎందుకు? ఈవో సూర్య‌కుమారి మీద వేటు వేయ‌టం ఎందుకు? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌దు. ఈవో సూర్య‌కుమారి మీద వేటు ప‌డింద‌న్న మాట వినిపిస్తున్నా.. క్లారిటీ రాని ప‌రిస్థితి తాను వెళ్లిపోతాన‌న్న ఉద్దేశంతో హ‌డావుడిగా కొన్ని ఫైళ్ల మీద సంత‌కాలు కూడా చేసేసి.. రెఢీ అయిన‌ట్లు చెబుతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ వ్య‌వ‌హారంలో ఇద్ద‌రు స్వామీజీల మాట‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ప్ర‌భుత్వ పెద్ద‌లు.. దేవాదాయ శాఖాధికారుల మాట‌ల మాదిరే ఒక స్వామి ఈవో మేడ‌మ్‌ ను వెనుకేసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తే.. మ‌రో స్వామీజీ అందుకు భిన్నంగా మండిప‌డుతున్నారు. తాంత్రిక పూజ‌ల‌కు భాద్యులైన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని.. ఈవో మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్వామి స్వ‌రూపానంద క‌స్సుమంటే.. మ‌రోవైపు ప‌రిపూర్ణానంద స్వామి మాత్రం ఈవో మేడ‌మ్ త‌ప్పు లేద‌ని స‌ర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. ఆమె చాలామంచిద‌ని.. నిబ‌ద్ధ‌త క‌లిగిన అధికారిణి అని.. అస‌లు అక్క‌డ అర్థ‌రాత్రి పూజ‌లు జ‌రుగుతున్న‌ట్లుగా లేద‌ని చెప్పేయ‌టం గ‌మ‌నార్హం. మ‌రి.. సీసీ రెమేరా ఫుటేజ్ మాటేందన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. అమ్మ‌వారి విష‌యంలో ఇద్ద‌రు స్వామీజీలు భిన్న‌ధ్రువాలుగా మారితే.. మిగిలిన వారు ఇంకెన్ని ధ్రువాలుగా మార‌తారో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.
Tags:    

Similar News