రేవంత్‌ రెడ్డికి షాకిస్తున్న కాంగ్రెస్ సీనియ‌ర్లు

Update: 2021-08-05 03:04 GMT
కాంగ్రెస్ పార్టీలోని ఉద్దండుల‌ను ప‌క్క‌న‌పెడుతూ త‌న టార్గెట్ అయిన టీపీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి సొంతం చేసుకున్న ఎంపీ రేవంత్ రెడ్డి ప‌ద‌వి సొంతం అయిన త‌ర్వాత త‌న దూకుడు కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీపై, తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీపై విరుచుకుప‌డుతున్నారు. అయితే, ఆయ‌న‌కు సొంత పార్టీ నేత‌ల నుంచే షాకులు ఎదుర‌వుతున్నాయి. తాజాగా జ‌రిగిన కీల‌క స‌మావేశం దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని అంటున్నారు. కీల‌క‌మైన హుజురాబాద్ ఉప ఎన్నిక సమీక్షా సమావేశానికి ఇద్ద‌రు ముఖ్య నేత‌లు డుమ్మా కొట్టడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కీల‌క‌మైన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో నిలబెట్టే అంశంపై జ‌రిగిన చ‌ర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఎన్నికల నిర్వహణ కమిటీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సమావేశమయ్యారు. బీజేపీ అభ్యర్థి పేరు దాదాపు ఖరారైన నేపథ్యంలో విజయావకాశాలు ఉన్న నేతల గురించి చర్చించారు. ఇప్పటివరకూ హుజూరాబాద్‌పై దృష్టి పెట్టని కాంగ్రెస్ ఇక నుంచి కార్యాచరణ మొదలు పెట్టాలనుకుంటున్నందున‌ పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పటీ వాటిని వదులుకుని రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి వచ్చారు. ఎన్నికల సంఘం షెడ్యూలు ఎప్పుడు ప్రకటిస్తుందనే అంశంతో సంబంధం లేకుండానే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంకు చీలిపోకుండా పటిష్టంగా కాపాడుకోవడంపై ఎక్కువ చర్చలు జరిగాయి. అయితే, ఈ స‌మావేశానికి ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్ బాబు గైర్హాజ‌ర‌య్యారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ లుగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఈ స‌మావేశానికి హాజరు కాలేదు. పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు తీసుకున్నప్పుడు కూడా జీవన్ రెడ్డి దూరంగానే ఉన్నారు. రేవంత్ రెడ్డిని చీఫ్ గా ప్రకటించడాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారా లేక మరేదైనా కారణం ఉందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోనే ఉన్నప్పటికీ మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు. కాగా ఆయన గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News