అయ్యో సుబ్బిరామిరెడ్డి..ఆల‌స్యం అమృతం విషం

Update: 2020-03-09 16:07 GMT
రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహ్మద్ అలీ ఖాన్‌ - టీ సుబ్బిరామిరెడ్డి - కే కేశవరావు - తోట సీతారామలక్ష్మి పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో చాన్స్ ఎవ‌రికి ద‌క్కుతుందా? అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది. ఇలాంటి త‌రుణంలో ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ న‌లుగురు నేత‌ల పేర్లు ఖ‌రారు చేసింది. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ - మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ - పార్టీ శ్రేయోభిలాషి ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటుగా వ్యాపార‌వేత్త‌ పరిమళ్‌ నత్వానికి చాన్స్ ఇచ్చింది. అయితే, తెలుగువారికి సుప్ర‌సిద్ధుడైన వ్యాపార‌వేత్త సుబ్బిరామిరెడ్డికి చివ‌రి నిమిషంలో నిరాశ ఎదురైంది.

ప‌ద‌వీ కాలం ముగిసిపోతున్న ఎంపీ సుబ్బిరామిరెడ్డి త‌న‌కు తిరిగి అవ‌కాశం పొందే విష‌యంలో చేసిన తాత్సారం ఆయ‌న‌కు షాక్ ఇచ్చింద‌ని అంటున్నారు. గ‌త శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైన సంగ‌తి తెలిసిందే. అయితే సుబ్బిరామిరెడ్డి ఇన్నాళ్లుగా సీటు విష‌యంలో ప్ర‌య‌త్నించకుండా సోమ‌వారం హ‌ఠాత్తుగా తాడేప‌ల్లి వెళ్లి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ ను క‌లిసి త‌న‌కు సీటు ఇవ్వాల‌ని అడిగార‌ని స‌మాచారం. అయితే, ఆయ‌న‌కు సీఎం జ‌గ‌న్ నో చెప్పిన‌ట్లు తెలుస్తోంది. తాను ఇప్ప‌టికే సీట్ల విష‌యంలో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశాన‌ని పేర్కొన్న జ‌గ‌న్‌..చివ‌రి నిమిషంలో మార్పులు చేయ‌లేన‌ని వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. దీంతో ఈ క‌ళాబంధుకు నిరాశ త‌ప్ప‌లేదు. కాగా, సుబ్బిరామిరెడ్డి ముందు ప్ర‌య‌త్నించి ఉంటే జ‌గ‌న్ ఆయ‌నకు అవ‌కాశం ఇచ్చే వారని అంటున్నారు. ఇదిలాఉండగా ఆంధప్రదేశ్ రాష్ట్రం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి గ‌త శుక్రవారం నుంచి మార్చి 13వ తేదీ లోపు నామినేషన్లు దాఖ‌లు చేయ‌వ‌చ్చు. మార్చి 16వ తేదీ నామినేషన్ల పరిశీలన - మార్చి 18వ తేదీని మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు.
Tags:    

Similar News