యువ‌రాజు ఎంత రాటు దేలాడో చూశారా?

Update: 2016-09-08 09:24 GMT
కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ బాగా రాటు దేలుతున్నాడ‌ని కాంగ్రెస్ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి. కొత్త త‌ర‌హాలో ప్ర‌యోగం చేసి ప‌రిహాసం పాల‌య్యాడ‌ని ప‌లువురు న‌వ్వుకుంటుంటే...రాహుల్ మాత్రం విభిన్నంగా తీసుకున్నారు. అంతేకాదు కేంద్ర ప్ర‌భుత్వానికి - ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి చుర‌క‌లంటించారు. 27 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ ను హ‌స్త‌గ‌తం చేసుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఈసారి కాంగ్రెస్ పావులు క‌దుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో కిసాన్ యాత్ర‌ - ఖాట్ స‌భ‌లంటూ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్.. రాహుల్‌ గాంధీ స‌భ‌ల‌కు ప్ర‌ణాళిక ర‌చిస్తున్నారు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన రాహుల్ గాంధీ ఖాట్ స‌భ‌లో వేసిన మంచాల‌ను గ్రామ‌స్థులు ఎత్తుకెళ్ల‌డం న‌వ్వుల‌పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై యువ‌రాజు భిన్నంగా స్పందించారు.

యూపీలో తొలిరోజు కిసాన్ యాత్ర సంద‌ర్భంగా దేవ‌రియాలో జ‌రిగిన స‌భ‌లో కొత్త‌గా మంచాలు ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌భ ముగియ‌గానే అక్క‌డి గ్రామ‌స్థులు ఆ మంచాల‌ను ప‌ట్టుకెళ్లారు. ఆ ఘ‌ట‌న‌ను గుర్తు చేస్తూ రాహుల్ ప‌రోక్షంగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించారు. మంచాలు ఎత్తుకెళ్తేనే దొంగ‌ల‌ని అంటున్నారు. 9 వేల కోట్లు ఎగ‌నామం పెట్టి పారిపోయిన పారిశ్రామిక‌వేత్త‌ల‌ను మాత్రం డీఫాల్ట‌ర్లు (ఎగ‌వేత‌దారు) అంటున్నారంటూ ప‌రోక్షంగా లిక్కర్ కింగ్ విజ‌య్ మాల్యాను - ఆయ‌న‌ను వెన‌క్కి తీసుకురావ‌డంలో విఫ‌ల‌మైన కేంద్ర స‌ర్కారును విమ‌ర్శించారు. ఎన్డీఏ ప్ర‌భుత్వం రైతుల‌ను వ‌దిలి కార్పొరేట్ల కోసం ప‌నిచేస్తోందంటూ రాహుల్ ఆరోపించారు.  కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డిన తీరు స‌భకు వ‌చ్చిన వారిని ఆక‌ట్టుకుందని కాంగ్రెస్ వ‌ర్గాలు బ‌లంగా చెప్తున్నాయి మ‌రి.
Tags:    

Similar News