జగన్ చిన్న పోరడంటున్న తెలంగాణ మంత్రి

Update: 2016-02-24 04:27 GMT
ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ కు.. తెలంగాణ అధికారపక్షానికి మధ్యనున్నరహస్య స్నేహితుడి రిలేషన్ గురించి చాలామంది చాలానే చెబుతుంటారు. సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా.. స్నేహితుడి మీద ఈగ వాలకుండా ఆయన చూసుకుంటారని.. ఏదైనా ఇష్యూ వస్తే తన సీక్రెట్ ఫ్రెండ్ గురించి జగన్ ఒక్కమాట కూడా అనరన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి విమర్శలకు తగ్గట్లే.. ఏ ఇష్యూలోనూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శిస్తూ జగన్ ఒక్కటంటే ఒక్క విమర్శ చేసింది లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా జగన్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేసిన అంశంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఒకరు స్పందించటమే కాదు.. జగన్ ను వెనకేసుకొచ్చిన వైనం చూసినప్పుడు ఔరా అనిపించకమానదు.

జగన్.. చిన్న పోరడని.. అలాంటి పిల్లోడి మీద రాజకీయాలు చేస్తున్నారు.. మీకేమన్నా సిగ్గుందా? అంటూ టీడీపీ నేతల్ని కడిగేశారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒక టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తలసాని.. టీడీపీ నేత సోమిరెడ్డి మీద ఫైర్ అవుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నిన్నకాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన చిన్న పోరడిపైన రాజకీయాలు చేస్తున్నారని.. అసలు మీకేమన్నా సిగ్గుందా? అంటూ నిలదీయటం గమనార్హం. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ రాజకీయాలు చేస్తున్నారన్న మాటపై తీవ్రంగా మండిపడ్డ ఆయన.. జగన్ ను అడ్డంగా వెనకేసుకురావటం గమనార్హం.

తెలంగాణలో కుటుంబ రాజకీయాలని అంటున్నారని.. మరి ఏపీలో టీడీపీ చేసేవి ఏ రాజకీయాలని డైరెక్ట్ గా అడిగేసిన తలసాని.. టీడీపీ చేస్తే ఒప్పు.. ఇతర పార్టీలు చేస్తే తప్పు అని అనటం సరికాదని హితవు పలికారు. తనకు ఏపీ రాజకీయాల మీద ఎలాంటి ఆసక్తి లేదని చెప్పుకున్న తలసాని.. తిట్టాల్సి వచ్చినప్పుడు మాత్రం ఏపీ రాజకీయాల్నేప్రస్తావించటం గమనార్హం.

జగన్ ను చిన్న పోరడిగా అభివర్ణిస్తున్న తలసాని.. మరి.. అదే చిన్న పోరడు తండ్రి భౌతికాయం కంటి ముందు ఉంటే.. సీఎం కావటానికి పక్క గదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని క్యూలో పెట్టించి సంతకాలు పెట్టించటాన్ని ఏమనాలి? మరి.. చిన్న పోరడే అయితే.. ఏపీ అధికారపార్టీని గంటలో కూల్చేయగలనని చెప్పటం ఏమిటి? తలసాని చెప్పినట్లే జగన్ చిన్న పోరడే అనుకుందాం.  మరి.. ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తన పార్టీలోకి ఎందుకు తీసుకెళ్లిపోతారు? చంద్రబాబు విషయంలో పోరడిగా కనిపించే జగన్.. కేసీఆర్ విషయంలో అందుకు భిన్నంగా కనిపించటం ఏమిటి తలసాని..?
Tags:    

Similar News