బాబును ఎడాపెడా తిట్టేస్తే ఇలాంటి ఆఫ‌ర్లు వ‌స్తాయా?

Update: 2019-03-18 05:01 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను అంచ‌నా వేయ‌టం అంత తేలికైన విష‌యం కాద‌ని.. అందుకు ఎంతో మేథోత‌నం ఉండాల‌ని ప‌లువురు చెబుతుంటారు. ఆయ‌న ట‌ఫ్ న‌ట్ అని.. ఆయ‌న ఒక ప‌ట్టాన ఎవ‌రికి అర్థం కార‌ని.. ఆయ‌న్ను అర్థం చేసుకోవాల‌న్న ప్ర‌య‌త్నం ఒక ప‌ట్టాన సాధ్యం కాద‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు. అయితే.. అంత సినిమా లేద‌న్న విష‌యం తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు.

కేసీఆర్ లాంటి అధినేత‌ను అర్థం చేసుకోవ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రికి సాధ్యం కాలేద‌న్న మాట‌కు కాలం చెల్లిన‌ట్లే. ఎంత పెద్ద సాఫ్ట్ వేర్ అయినా.. ఏదో ఒక లోపం ఉండ‌కుండా ఉండ‌దు. అయితే.. అదంతా దాన్ని  గుర్తించే తెలివి ఉన్నోళ్ల‌కు  టుమ్రీ లాంటిది అయితే మిగిలిన వారికి మాత్రం పెద్ద తోపు. తాజాగా సాగుతున్న ప్ర‌చారం నిజ‌మైతే.. కేసీఆర్ లాంటి తెలివైన .తోపును ఎలా డీల్ చేయాలి?  ఎలా సంతృప్తి ప‌ర్చాల‌న్న విష‌యాన్ని త‌ల‌సాని లాంటోళ్లు ప‌ట్టేశార‌ని చెప్పాలి. ఎందుకంటే.. ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ పొంద‌నంత లాభాన్ని త‌ల‌సాని పొంద‌ట‌మే కాదు.. తాజా ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న కోరుకున్న‌దే కేసీఆర్ చేయ‌టం నిద‌ర్శ‌నంగా చెప్పాలి.

నేత ఎవ‌రైనా స‌రే వారు కోరిన దాని కంటే.. తానేం ఇవ్వాల‌నుకున్నానో అది మాత్ర‌మే ఇచ్చే అల‌వాటు కేసీఆర్ లో కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంటుంది. ఎంత‌టి పోటుగాళ్ల‌ను సైతం త‌న‌కు జీహుజూర్ అనేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అయితే.. అలాంటి కేసీఆర్ ను తాను కోరుకున్న‌ట్లుగా మ‌లుచుకోవ‌టంలో త‌ల‌సాని స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి.  ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత మంత్రివ‌ర్గాన్ని ఏర్పాటు చేయ‌గా.. ప‌లువురు సీనియ‌ర్ల‌కు ప‌ద‌వులు ఇవ్వ‌కుండా చెక్ చెప్పిన కేసీఆర్‌..త‌ల‌సానికి మాత్రం మంత్రి ప‌ద‌వి ఇచ్చేశారు.

తాజాగా ఆయ‌న కుమారుడికి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చేస్తున్నార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఒక‌వేళ అదే నిజ‌మైతే త‌ల‌సానికి కేసీఆర్ భారీ న‌జ‌రానాను ఇచ్చిన‌ట్లే. ఎందుకంటే.. టీఆర్ ఎస్ లో ఒకే కుటుంబానికి అదే ప‌నిగా పెద్ద పీట వేయటం అస్స‌లు క‌నిపించ‌దు. దీని మిన‌హాయింపుగా త‌ల‌సాని వ్య‌వ‌హారాన్ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే.. త‌ల‌సానికి మంత్రి ప‌ద‌వి ఇచ్చిన కేసీఆర్‌.. తాజాగా ఆయ‌న కుమారుడు సాయి కిర‌ణ్ కు సీటు క‌న్ఫ‌ర్మ్ చేయ‌టం చిన్న విష‌యం కాద‌నే చెప్పాలి.

ఇంత‌కీ త‌ల‌సానికి కేసీఆర్ ఎందుకంత ప్రాధాన్య‌త ఇస్తున్నార‌న్న‌ది చూస్తే.. బీసీ నేత‌గా.. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి ప్ర‌తినిధిగా.. హైద‌రాబాద్ లో మాంచి ప‌ట్టున్న నేత‌గా.. ఏ ప‌నైనా స‌రే చేసుకొచ్చే టాలెంట్ తో పాటు.. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌టం.. అధినేత మ‌న‌సును గుర్తెరిగి వ్య‌వ‌హ‌రించ‌టం లాంటివి త‌ల‌సానిలో సానుకూల అంశాలుగా చెప్పాలి. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే.. అధినేత అంటే అంతులేని అభిమానం. అంతుకు మించిన విన‌యం.. విధేయ‌త క‌ల‌గ‌లిసి ఉండ‌టం ఉండ‌టం కూడా కార‌ణం కావొచ్చు. టీఆర్ఎస్ లో అంత‌మంది నేత‌లు ఉన్నా.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ఆడుకునే రీతిలో తిట్టిపోయ‌గ‌ల సామ‌ర్థ్యం త‌ల‌సాని సొంతం. అంతేనా..ఏపీకి వెళ్లి మ‌రీ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా  తిట్టేసే స‌త్తా ఆయ‌న సొంతం. మ‌రిన్ని క్వాలిటీస్ ఉన్న త‌ల‌సానికి తోఫా ఇవ్వ‌కుండా కేసీఆర్ ఎందుకు ఉంటారు చెప్పండి?


Tags:    

Similar News