చంద్రబాబుపై తలసాని పొగడ్తలు

Update: 2016-01-11 11:16 GMT
టీడీపీ నుంచి ఎమ్మెల్యే గా గెలిచి ఆ తరువాత గోడ దూకి టీఆరెస్ లో మంత్రి పదవి కొట్టేసిని తలసాని శ్రీనివాసయాదవ్ నిన్నమొన్నటి వరకు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. చంద్రబాబును రోడ్డుకీడుస్తానని కూడా ఒక దశలో అన్న ఆయన ఇప్పుడు రూటు మార్చారు. తిట్టిన ఆ నోటితోనే చంద్రబాబు సూపర్ అంటున్నారు. ఏపీలో చంద్రబాబు పాలన చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. రీసెంటుగా ఆయన సంక్రాంతికి భీమవరం వెళ్తానని చెప్పిన సంగతి తెలిసిందే... ఆసక్తితో వెళ్తున్నారో.. గ్రేటర్ ఓటు బ్యాంకు కోసమో తెలియదు కానీ భీమవరం టూరు కన్ ఫర్మ్ చేసుకున్న ఆయన అక్కడ సీమాంధ్రుల నుంచి టీడీపీ శ్రేణుల నుంచి ఏమైనా ఇబ్బంది ఉంటుందని భావిస్తున్నారేమో మరి.. సడెన్ చంద్రబాబు భజన ప్రారంభించారు.
    
ఏపీలో చంద్రబాబు పాలన చాలాబాగుంది... రెండు తెలుగు రాష్ట్రాలను ఇద్దరు సీఎంలు చక్కగా పరిపాలిస్తున్నారు అంటూ ఆయన భజన మొదలుపెట్టారు. అంతేకాదు... ఇద్దరు సీఎంలు రెండు రాష్ట్రాల అభివృద్ది కోసం కష్టపడుతుంటే విపక్షాలు త‌ట్టుకోలేక‌పోతున్నాయ‌ని ఇంకో బిస్కెట్ కూడా వేశారాయన. చంద్రబాబు - కేసీఆర్ మ‌ధ్య చిచ్చు పెట్టాల‌ని కిష‌న్ రెడ్డి - కాంగ్రెస్ నేత‌లు ష‌బ్బీర్ ఆలీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ టీడీపీ నేత‌లు కేసీఆర్ పాల‌ను తీవ్రంగా విమ‌ర్శిస్తుంటే, తలసాని మాత్రం చంద్రబాబు పాలనను మెచ్చుకుంటున్నారు. భీమవరంలో తనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే ఆయన చంద్రబాబును పొగుడుతున్నారని... చంద్రబాబును పొగిడితే టీడీపీ శ్రేణుల నుంచి భీమవరంలో తనకు అభ్యంతరం ఉండదన్నది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. తలసాని చంద్రబాబును మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా గోదావరి జిల్లాలవారు మాత్రం తమ ప్రాంతానికి వచ్చిన అతిథులను ఏమీ అనరన్న సంగతి ఆయనకు తెలియదేమో. తలసాని అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సమయంలో... తలసాని విషయంలో నిర్లిప్తంగా వ్యవహరించి తెలంగాణ టీడీపీ నుంచి ఆగ్రహం చవిచూసిన తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి తూర్పుగోదావరి జిల్లాకు వస్తే ఆయనకు అతిథి మర్యాదలు చేసి పంపించిన సంగతి తలసాని గుర్తు తెచ్చుకోవాలి. అనవసర భయాలేవీ లేకుండా తలసాని భీమవరం రావొచ్చని గోదావరి ప్రజలు అంటున్నారు. రాజకీయం రాజకీయమే ఆతిథ్యం ఆతిథ్యమే.
Tags:    

Similar News