దాయాది కొత్త ఎత్తుగడ.. చర్చల పేరుతో కన్నింగ్ ప్లాన్

Update: 2019-08-31 12:12 GMT
జమ్ముకశ్మీర్ పై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో రగిలిపోతున్న దాయాది ఇష్టారాజ్యంగా మాట్లాడటం తెలిసిందే. కశ్మీర్ విషయంలో మోడీ సర్కారు ఇంతటి నిర్ణయం తీసుకుంటారని ఏ మాత్రం అంచనా లేని పాకిస్థాన్.. తనకు తోచిన రీతిలో భారత్ పైన ఒత్తిడి తెచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేయటం తెలిసిందే. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటోడు సైతం.. జమ్ముకశ్మీర్ విషయంలో కలుగుజేసుకునే విషయంలో మోడీ మాటతో వెనక్కి తగ్గటం తెలిసిందే.

ఇలాంటివేళ.. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఒక అడుగు ముందుకేసి.. అణు యుద్ధం మీద మాట్లాడటం తెలిసిందే. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో పాక్ కు యుద్ధం చేసేంత సీన్ లేదన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. చేతిలో అణ్వస్త్రాలు ఉంటే మాత్రం.. బాధ్యత లేకుండా ఇంత బాధ్యతారాహిత్యంతో మాట్లాడతారా? అంటూ ప్రపంచ దేశాలు పాక్ వైఖరిని తప్పు పడుతున్నాయి.

అంతర్జాతీయంగా తమకు ఎదరవుతున్న ప్రతికూలతను పాకిస్తాన్ గుర్తించినట్లుగా కనిపిస్తోంది. కశ్మీర్ మీద మోడీ సర్కారు నిర్ణయం తర్వాత భారత్ తో పలు అంశాల్లో సంబంధాల్ని ఏకపక్షంగా తెగతెంపులు చేసుకన్న పాక్.. అనూహ్యంగా ఇప్పుడు తన టోన్ మార్చేయటం గమనార్హం. ఆర్టికల్ 370 నిర్వీర్యం తర్వాత భారత్ పై అదే పనిగా  ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ నిప్పులు చెరుగుతుంటే.. పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి కొత్త పల్లవిని అందుకున్నారు.

చర్చలు జరిపేందుకు తామెప్పుడు నిషేధించలేదని.. రెండు దేశాల మధ్య సుదీర్ఘ చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. చర్చల అంశాన్ని తెర మీదకు తీసుకురావటం ద్వారా.. భారత్ ను ఇరుకున పెట్టే కొత్త ప్లాన్ ను బయటకు తీసింది. చర్చ జరగాలంటే.. తొలుత హౌస్ అరెస్ట్ లో ఉన్న కశ్మీర్ నేతల్ని.. హురియత్ నేతల్ని విడుదల చేయాలన్నారు. వారు బయటకు వచ్చాకే తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చల పేరుతో కశ్మీర్ నేతల్ని బయటకు తీసుకొస్తే కొత్త ఎత్తుగడకు తెర తీసినట్లుగా చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో హౌస్ అరెస్ట్ ఉన్న నేతలు బయటకు రావటం అంత తేలికైన విషయం కాదు. అందుకే.. ఆ విషయంలో భారత్ ను ఆత్మరక్షణలో నెట్టేందుకు వీలుగా పాక్ తాజా ప్లాన్ వేసిందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News