మాతృభాష విష‌యంలో త‌మిళ పోలీసుల సంచ‌ల‌న నిర్ణ‌యం

Update: 2019-11-27 13:02 GMT
ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో మాతృభాష తెలుగు మ‌నుగ‌డ‌పై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు - రాజ‌కీయ దుమారం రేగుతుంటే....మ‌రోవైపు ప‌క్క‌ రాష్ట్రమైన త‌మిళ‌నాడులో కీల‌క నిర్ణ‌యం వెలువ‌డింది. తమిళ తంబీలకు మాతృభాష పట్ల అమితమైన అభిమానం ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. అయితే, అది అధికారిక అంశాల్లో కూడా భాగం చేసేలా తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్లలో తమిళం తప్పని సరి చేస్తూ ఆ రాష్ట్ర డీజీపీ ఆదేశాలు వెలువ‌రించారు. పోలీస్ శాఖలో అమ‌లు చేయ‌బోయే ఈ నిర్ణ‌యంలో భాగంగా - ఆఫీస్ రికార్డులను కూడా తమిళంలోనే నిర్వ‌హించాల‌ని - హాజరు పట్టికలో సంతకాలు తమిళంలోనే చేయాలని డీజీపీ ఆదేశించారు.

మాతృభాషను పోలీస్ శాఖ‌లో అమ‌లు చేయ‌డంపై డీజీపీ కార్యాలయంలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం అధికారులు వివ‌రాలు వెల్ల‌డిస్తూ... మాతృభాషకు తమిళ ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తారని - తాము సైతం దాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. పోలీసు ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి మొదలుకొని రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు - సూపరింటెండెంట్ ఆఫీసుల్లోనూ రికార్డులను తమిళంలో త‌ప్ప‌నిస‌రిగా నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. శాఖాప‌ర‌మైన స‌మాచారం - సంతకాలు తమిళంలోనే పెట్టాలని ఆదేశాలు ఇచ్చారు. నేమ్ బోర్డులు - చివరికి ఆఫీస్ సీల్లు కూడా తమిళంలోనే ఉండాలని ఆదేశాలు వెలువ‌రించారు. పోలీసు వాహనాలపై కవల్(పోలీస్) అనే త‌మిళ‌ పదంను పొందుప‌ర్చాల‌ని ఈ ఆదేశాల్లో తేల్చిచెప్పారు.

కాగా, మాతృభాష అంటే అత్యంత ప్రాధాన్యం ఇచ్చే తంబీలు తాజా నిర్ణ‌యం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మాతృభాషకు తమిళప్రజలు ఇచ్చే ప్రాధాన్యత దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటోందంటున్నారు. ఇటీవ‌లే దేశ‌మంత‌టా హిందీ అమ‌లును త‌ప్ప‌నిస‌రి చేస్తే..త‌మిళ‌గ‌డ్డ‌పై వెలువ‌డిన నిర‌స‌న‌ల‌తో కేంద్రం ఆ నిర్ణ‌యం నుంచి ఉప‌సంహ‌రించుకున్న సంగ‌తి తెలిసిందే.
 
Tags:    

Similar News