జ‌ర్న‌లిస్ట్ బుగ్గ‌ల్ని తాకిన గ‌వ‌ర్న‌ర్!

Update: 2018-04-18 05:48 GMT
అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వారు త‌మ స్థాయికి త‌గిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవటం కొత్త ముచ్చ‌టేం కాదు. కానీ.. వేలెత్తి చూపించేలా త‌ప్పు చేయ‌టం స‌రికాదు. తాజాగా త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రిలాల్ పురోహిత్ ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రించి ఇప్పుడు స‌మ‌స్య‌ల్లో కూరుకుపోయారు.  78 ఏళ్ల ముదిమి వ‌య‌సులో ఉన్న గ‌వ‌ర్న‌ర్ ఒక జ‌ర్న‌లిస్టు బుగ్గ తాకితే రంధ్రాన్వేణ చేస్తారే? అన్న ప్ర‌శ్న వేయొచ్చు.

ఏ వ‌య‌సులో ఉన్న వారైనా స‌రే.. అనుమ‌తి లేకుండా ఒక మ‌హిళను తాకే ప్ర‌య‌త్నం చేయ‌టం.. అది స‌ర‌దా కోస‌మే అయినా త‌ప్పే అవుతుందని చెప్ప‌క త‌ప్ప‌దు. ఓవైపు లైంగిక వేధింపులు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌యంలోనే మ‌రో జ‌ర్న‌లిస్ట్ చెంప‌ను తాక‌టం ఏ రీతిలో స‌బ‌బు? అన్న‌ది ఇక్క‌డ ప్ర‌శ్న.

అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ నిర్మ‌లాదేవి తాజాగా ఒక బాంబు పేల్చారు. త‌న‌కు ప‌రిచ‌యం ఉన్న త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ బ‌న్వ‌రిలాల్ త‌న‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేశారంటూ ఆరోపించారు. దీనిపై తాజాగా విలేక‌రుల స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు గ‌వ‌ర్న‌ర్. స‌ద‌రు ప్రొఫెస‌ర్ ఎవ‌రో త‌న‌కు తెలీద‌న్నారు.

ఈ మీడియా స‌మావేశానికి హాజ‌రైన ఒక మ‌హిళా జ‌ర్న‌లిస్టు గ‌వ‌ర్న‌ర్ ను ఉద్దేశించి ఒక ప్ర‌శ్న సంధించారు. దీనికి స‌మాధానం చెప్ప‌ని ఆయ‌న‌.. స‌ద‌రు జ‌ర్న‌లిస్టు చెంప‌ను తాకారు. దీంతో అక్క‌డి వారంతా అవాక్కు అయ్యారు. గ‌వ‌ర్న‌ర్ తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.  ఈ ఉదంతంపై స‌ద‌రు మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ.. "విలేక‌రుల స‌మావేశంలో భాగంగా త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ బ‌న‌ర్విలాల్ ను ప్ర‌శ్న అడిగాను. దానికి బ‌దులుగా ఆయ‌న నా చెంప‌ను తాకారు. ఒక మ‌హిళ అనుమ‌తి లేకుండా ఆమెను తాక‌టం మంచి ప‌ద్ద‌తి కాదు. నా ముఖాన్ని ప‌దే ప‌దే శుభ్రం చేసుకున్నా. కానీ.. ఆ మ‌లినం న‌న్ను వ‌దిలిన‌ట్లుగా అనిపించ‌లేదు. 78 ఏళ్ల వ‌య‌సున్న మీరు తాత‌య్య‌లాంటి వారే కావొచ్చు. కానీ మీ చ‌ర్య నాకు త‌ప్పుగా అనిపిస్తోంది" అంటూ త‌న అభిప్రాయాన్ని ఆమె చెప్పేశారు. ఈ ఉదంతం త‌మిళ‌నాడు రాజ‌కీయ ప‌క్షాలు త‌ప్ప ప‌డుతున్నాయి. గ‌వ‌ర్న‌ర్ తీరును త‌ప్పు ప‌డుతున్న నేప‌థ్యంలో బ‌న్వ‌రిలాల్ విష‌యంలో కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.


Tags:    

Similar News