త‌మిళ రాజ‌కీయంః ర‌జ‌నీతో క‌మ‌ల్ భేటీ.. అమిత్ షాతో శ‌శిక‌ళ రాయ‌భారం..ఏం జ‌రుగుతోంది?

Update: 2021-02-20 14:00 GMT
తమిళ నాడులో ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. రాబోయే ఏప్రిల్ లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో పార్టీల‌న్నీ అస్త్ర‌శ‌‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. వ్యూహ ప్ర‌తివ్యూహాలు ర‌చిస్తున్నాయి. ఈ క్ర‌మంలో త‌మిళ్ సూప‌ర్ రాజ‌నీ కాంత్ తో న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు క‌మ‌ల్ భేటీ కాగా.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో శ‌శిక‌ళ రాయ‌భారం న‌డిపారు. దీంతో.. త‌మిళ‌నాట‌ రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది.

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్హాసన్ శనివారం సూపర్స్టార్ రజనీకాంత్తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చెన్నైలోని రజనీ నివాసానికి వెళ్లిన క‌మ‌ల్‌.. ర‌జ‌నీతో ఏకాంతంగా భేటీ అయ్యారు. దీంతో.. వీరిద్ద‌రూ ఏం చ‌ర్చించుకున్నారు? అనే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ సందర్భంగా ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాసన్‌ అరగంటకు పైగా చర్చించుకున్నారు. అయితే.. ఈ స‌మావేశంలో రాజ‌కీయాలు చ‌ర్చ‌కు రాలేద‌ని క‌మ‌ల్ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ''ఇది మర్యాదపూర్వక సమావేశం, రాజకీయ పరమైనది కాదు'' అని కమల్ పార్టీ ప్రకటించింది. అయితే.. మరో రెండు నెలల్లోనే తమిళనాడు అసెంబ్లీకి జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కమల్-రజనీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. రజనీ రాజకీయాల్లోకి రావట్లేదని ప్రకటించిన సమయంలోనే.. తాను మద్దతు కోరుతానని కమల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో.. ఈ భేటీలో అదే విషయమై చర్చించారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మరోవైపు జ‌య‌ల‌లిత నెచ్చెలి శ‌శిక‌ళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాయ‌భారం న‌డిపిన‌ట్టు స‌మాచారం. త‌న‌కు ప్రధాన కార్యదర్శి పదవి, అసెంబ్లీ ఎన్నికల్లో తమ వారికి 40 సీట్లు కేటాయిస్తే తమ పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేస్తామని 'అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం' నేత టీటీవీ దినకరన్‌, శశికళ రాయభారం నడిపినట్లు తెలుస్తోంది. త‌మ‌కు అనుకూలంగా ఉన్న‌ ఇద్దరు పారిశ్రామికవేత్తల ద్వారా అమిత్‌షా వ‌ద్ద‌కు, ముఖ్యమంత్రి పళనిస్వామి వద్దకు ఈ రాయ‌భారం చేర‌వేసిన‌ట్టు స‌మాచారం. మ‌రి, ఇదే నిజ‌మైతే ఎలాంటి పొత్తులు కుదురుతాయో చూడాలి.
Tags:    

Similar News