టీఆర్ఎస్ పైలెట్.. తెలంగాణకే హైలెట్...!

Update: 2022-10-29 03:56 GMT
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలంగాణకే హైలైట్ అయ్యారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు మార్మోగుతోంది. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని పట్టించిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ మాదిరే ఇపుడు పైలెట్ కూడా అందరి నోళ్లలో నానుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం ఈయన ఆధ్వర్యంలోనే జరగడమే కారణం.

దేశవ్యాప్తంగా ముక్త కాంగ్రెస్ దిశగా కదులుతున్న బీజేపీ అందుకు వేగంగా ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ తోపాటు ఆయా రాష్ట్రాల్లో తమకు ప్రధాన పోటీగా ఉన్న మిగతా పక్షాలను కూడా మింగేయాలని భావిస్తోంది. త్రిపుర, గోవా, మహారాష్ట్ర, ఢిల్లీలో జరిగిన పరిణామాలు తెలిసిందే. గతంలో కర్ణాటకలో కూడా అదే పంథా అవలంబించింది. తాజాగా తమ చూపును తెలంగాణపై సారించింది.

బండి సంజయ్ సారథ్యంలో బలం పుంజుకుంటోన్న పార్టీని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందుకు వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి మునుగోడు ఉప ఎన్నికను తీసుకొచ్చిన బీజేపీ మరికొన్ని ఉప ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తోంది. కాంగ్రెస్ లో ఆ అవకాశం లేకపోవడంతో టీఆర్ఎస్ పై కన్నేసింది.

మధ్యవర్తుల ద్వారా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిపై గురిపెట్టారు కేంద్ర పెద్దలు. ఆయన ఆధ్వర్యంలో వీలైనంత మంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి తీసుకొచ్చి రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలనేది బీజేపీ ప్రణాళిక. ఈ ఎన్నికలు వచ్చే గుజరాత్ ఎన్నికలతో పాటు కానీ.. లేదా ఏప్రిల్, మేలో జరిగే కర్ణాటక ఎన్నికలతో వెళ్లాలని ఆలోచించారట.

పైలెట్ తో సన్నిహితంగా ఉన్న అచ్చంపేట, కొల్లాపూర్, పినపాక ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్దన్ రెడ్డి, రేగా కాంతారావులతో కొందరు కేంద్ర పెద్దలు మంతనాలు సాగించారట. వీరితో చర్చించేందుకు దూతలుగా ఆ ముగ్గురిని పంపించారని తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్ల నగదు, కాంట్రాక్టులు, బీజేపీలో పదవులు ఇస్తామని ఆశ చూపారట.

తొలుత ఈ నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బిగ్ షాక్ ఇవ్వాలని భావించారట. మునుగోడు ఉప ఎన్నిక తేదీలోగానే ఈ ప్రక్రియ ముగించాలని యోచించారట. అయితే ఈ విషయం కేసీఆర్ కు తెలియడంతో బీజేపీ ప్రణాళిక తుస్సుమందని సమాచారం. బీజేపీ ఆయుధాన్నే తన ఆయుధంగా మార్చుకున్న కేసీఆర్ రోహిత్ రెడ్డితోనే ఆ దూతలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో తాండూరులో ఎమ్మెల్యే వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో తిరిగి టికెట్ పైలెట్ కే వస్తుందని.. మహేందర్ రెడ్డికి మొండిచేయి తప్పదని భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News