విశాఖ‌లో అధికార విప‌క్షాల సందడి

Update: 2016-05-30 11:49 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల జ‌రిగిన రెండేళ్ల త‌ర్వాత మ‌రో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల సంద‌డి నెల‌కొన‌నుంది. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్‌ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే యోచనతో ప్రభుత్వం ఉన్నట్లు ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించిన నేప‌థ్యంలో కొత్త హ‌డావుడి ప్రారంభ‌మైంది. ఎన్నికలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడటంతో ప్రధాన రాజకీయ పక్షాల్లో వేడి మొదలైంది. సెప్టెంబరు - అక్టోబరులో ఎన్నికలను నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. ఈలోగా నగరంలో కొత్త ప్రాంతాల విలీనానికి సంబంధించి కోర్టు కేసుల పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టారు. కొత్త ఓటర్ల చేర్పు - తొలగింపు - ఓటర్ల జాబితాల సవరణ - పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు వంటి విషయాలపైనా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.  దీంతో ఈ అంశంపై ఉన్న సందిగ్ధత తొలగిపోయింది. ఈ వరుస పరిణామాలతో రాజకీయపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ కలిసి పోటీ చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. నగర పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను - లోక్‌ సభ స్థానాన్ని గెలిపించుకున్నాయి. జీవీఎంసీ ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేసేందుకు రెండు పక్షాలూ సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీల నాయకులు సంప్రదింపులు జరుపుతున్నారు. మొత్తం వార్డుల్లో భాజపాకు ఎన్ని కేటాయించాలి, టీడీపీ తరఫున ఎన్ని వార్డుల్లో పోటీ చేయాలన్న విషయాలపైనా వీరు ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కీలకమైన మేయర్‌ పదవికి మాత్రం తెదేపా అభ్యర్థే బరిలోకి దిగే అవకాశం ఉంది. అభ్యర్థి ఎవరనేది జిల్లా మంత్రులు - అధికారపక్ష ఎమ్మెల్యేలు - భాజపా ఎంపీ - ఎమ్మెల్యే - ఇతర నాయకులంతా కలిసి చర్చించిన తరువాత ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. దీనికి మరికొంత సమయం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాతే దీనిపై స్పష్టత వస్తుందంటున్నారు. వార్డుల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు రెండు పార్టీల్లోనూ నేతల హడావిడి ఇప్పటికే మొదలైపోయింది. వీరంతా టిక్కెట్ల కోసం ఇప్పట్నుంచే జిల్లా మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలను ప్రసన్నం చేసుకుంటున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభావాన్ని ఎదుర్కొన్న వైకాపా జీవీఎంసీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. కొన్ని రోజుల క్రితం ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి వార్డులవారీగా శ్రేణులతో సమావేశమయ్యారు. ప్రజల్లోకి వెళ్లేందుకు తాజా రాజకీయ పరిణామాలను వినియోగించుకోవాలన్నది ఆ పార్టీ నేతల వ్యూహం. దాదాపు అన్నివార్డుల్లోనూ వైకాపా తరఫున కార్పొరేటర్‌ అభ్యర్థులు బరిలో దిగే అవకాశాలున్నాయి. 2007 జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్‌ - ఉప మేయర్‌ పీఠాలను దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో విభజన మూల్యాన్ని భారీగానే చెల్లించుకుంది. జీవీఎంసీ ఎన్నికల్లో మేయర్‌తోపాటు అన్ని వార్డుల్లోనూ కార్పొరేటర్‌ అభ్యర్థులు పోటీలో నిలిచే అవకాశాలున్నాయి. మేయర్‌ అభ్యర్థి ఎవరనేది ఇప్పటికీ కాంగ్రెస్‌లో స్పష్టత లేదు. ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారంతో ఒక వైద్యుడు - మరో పారిశ్రామికవేత్త ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీ ఎన్నికల్లో పోటీకి సీపీఎం, సీపీఐ కూడా సమాయత్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో ఈ రెండు పక్షాలూ వేర్వేరుగా పోటీ చేశాయి. ఈసారి కూడా అదే విధంగా బరిలోకి దిగుతాయా? అనేది చూడాలి. లోక్‌ సత్తా తరఫున కూడా అభ్యర్థులు బరిలో నిలిచే అవకాశాలున్నాయి.
Tags:    

Similar News