కడపలో యుద్ధ వాతావరణం

Update: 2017-02-27 08:05 GMT
కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడుతోంది.  టీడీపీ ఏం చేసినా ప్రశ్నించకూడదన్న ధోరణిలో అక్కడి నాయకులు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఎర్రగుంట్లలో ఉద్రికత్త పరిస్థితి ఏర్పడింది.   వైసీపీ తరపున గెలిచిన ఒక కౌన్సిలర్ టీడీపీలోకి ఫిరాయించడంపై ఎర్రగుంట్లకు చెందిన వైసీపీ కార్యకర్త సుబ్బారెడ్డి నిలదీశారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం ఎంతవరకు నైతికమని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గీయులు సుబ్బారెడ్డిని కొట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పోలీస్ స్టేషన్‌ కు వచ్చారు. కేసు నమోదు చేయవద్దని స్టేషన్‌ లోనే పంచాయితీ చేయబోయారు.
    
ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అవినాష్‌ రెడ్డి - జమ్మలమడుగు వైసీపీ ఇన్‌ చార్జ్ సుధీర్ రెడ్డిలు స్టేషన్ వద్దకు వచ్చారు. దీంతో రెండుపార్టీల కార్యకర్తలు మరోసారి స్టేషన్‌ వద్దే బాహాబాహీకి దిగారు.  టీడీపీ కార్యకర్తల దాడిలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. టీడీపీ వర్గీయులపై కేసు నమోదు చేయకుండా ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ లోనే సెటిల్‌మెంట్‌కు ప్రయత్నించారని ఆరోపిస్తూ  నిరసిస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి - సుధీర్‌ రెడ్డిలు స్టేషన్ వద్ద బైఠాయించారు.
    
ఇరువర్గాల వారు భారీగా స్టేషన్‌ వద్ద గుమిగూడడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సుబ్బారెడ్డిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి 200పైగా స్థానిక ప్రజాప్రతినిధులు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఫిరాయించేలా చేసేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News