మంత్రి గంటాపై కేడ‌ర్‌ లోనే ఆగ్ర‌హ జ్వాల‌లు

Update: 2017-09-23 17:06 GMT
విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాస‌రావుపై స్థానికంగా ప్ర‌జ‌లు దుమ్మెత్తి పోస్తున్నారు. వీరికి టీడీపీ కార్య‌క‌ర్త‌లు కూడా గొంతు క‌లుపుతున్నారు. ఎంత రెచ్చిపోవాల‌నుకున్నా.. మొత్తం కుటుంబం కుటుంబాన్నీ జ‌నాల‌మీద‌కి తోలేస్తారా? అంటూ గంటాపై మ‌హిళ‌లు విరుచుకుప‌డుతున్నారు. దీనికి కార‌ణం ఏంట‌ని ఆరాతీస్తే.. గంటా ఫ్యామిలీ మొత్తంగా ఇప్పుడు భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో హ‌ల్ చ‌ల్ సృష్టిస్తోంద‌ట‌!  ఓట్లు గంటాకి.. పెత్త‌నం మాకు అన్న‌ట్టుగా గంటా ఫ్యామిలీ మెంబ‌ర్లు హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నార‌ట‌. విష‌యంలోకి వెళ్తే..

 మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ - మంత్రిగారి అనుచ‌రుడు కం స్నేహితుడు భాస్క‌ర‌రావు - మంత్రి వ‌ర్యుల మేన‌ల్లుడు విజ‌య‌సాయిలు.. మంత్రిగారి పేరు చెప్పుకొని నేరుగా అధికారిక కార్య‌క్ర‌మాల్లో సైతం పాల్గొంటున్నార‌ట‌. వాస్త‌వానికి వీరికి అధికారికంగా ఇటు పార్టీలోకానీ - అటు ప్ర‌భుత్వంలో కానీ ఎలాంటి ప‌ద‌వులూ లేవు. అయినాకూడా వీరు అన్నీ మాకు చెప్పే చేయాలి?  అన్నీ మా చేతుల మీదుగానే జ‌ర‌గాలి అనే ధోర‌ణిలో పోతున్నార‌ట‌. మొన్న మ‌ధుర‌వాడ‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ర‌వితేజ పాల్గొని హ‌డావుడి సృష్టించాడు. త‌ర్వాత జోరు భీమిలిలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మంత్రి స్నేహితుడు భాస్క‌ర‌రావు  మంత్రి క‌న్నా ఎక్క‌వు స్టైల్‌ గా పాల్గొన్నాడు.

ఇప్పుడు తాజాగా  మంత్రి మేనల్లుడు విజయసాయి తగరపువలసలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి  అంద‌రినీ ముక్కుపై వేలు వేయించాడు. ఏ అధికారంతో వీరు ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజలు - ప్రారంభోత్సవాలు చేస్తున్నారో త‌మ‌కు అర్ధం కావ‌డం లేద‌ని స్థానిక మ‌హిళ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, పార్టీనే న‌మ్ముకుని, ఏళ్ల‌త‌ర‌బ‌డి పార్టీకి సేవ చేసిన‌ భీమిలికి చెందిన టీడీపీ నాయకులు వీరి హ‌వాతో ల‌బోదిబో మంటున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, వివిధ హోదాలలో పార్టీ పదవులు చేపట్టిన సీనియర్‌ నాయకులను  కూడా ప‌లు కార్య‌క్ర‌మాల‌కు దూరంగా నే ఉంచ‌డంపై కేడ‌ర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది.

 అంతేకాదు, ఈ విష‌యంలో అటు అధికారులు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్రొటోకాల్‌ను పాటించాల‌ని తాము మొత్తుకుంటున్నా.. కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. ఇంకా ఏమైనా నిబంధ‌న‌ల‌ను మాట్లాడితే.. మంత్రిగారి ఆగ్రహానికి గురయ్యే అవ‌కాశం ఉంద‌ని కొందరు హెచ్చ‌రిస్తున్న‌ట్టు కూడా అధికారులు చెబుతున్నారు.  మ‌రి ఇలాంటి ప‌రిస్థితిని ఎవ‌రు చ‌క్క‌దిద్దుతారో చూడాలి.
Tags:    

Similar News