ఘర్షణ - కాల్పులు.. గాయపడిన టీడీపీ అభ్యర్థి

Update: 2019-03-16 07:05 GMT
కర్నూలు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన వెలువడడంతో టీడీపీ - వైసీపీ నేతల మధ్య యుద్ధ వాతావరణం తలపిస్తోంది. ఒకరిపై ఒకరు దాడులు - ప్రతిదాడుల దాకా ఘర్షణ చోటుచేసుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో ఇరువర్గాల నేతలు వెనక్కి తగ్గకపోవడంతో కర్నూలులో పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి.

తాజాగా కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కగ్గల్లుకు శనివారం ఎన్నికల ప్రచారం నిమిత్తం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి వచ్చాడు. ఆ సమయంలోనే తిక్కారెడ్డిని గ్రామస్థులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వైసీపీ శ్రేణులు కూడా వీరికి తోడుగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు గ్రామస్థులు - వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం.. టీడీపీ అభ్యర్థిపైకి రావడంతో తిక్కారెడ్డి గన్ మెన్ 10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు.

ఈ కాల్పుల్లో తిక్కారెడ్డితోపాటు అక్కడే ఉన్న ఏఎస్సై - కానిస్టేబుల్ - ఓ హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు.
   

Tags:    

Similar News