ఓటుకు కోట్లు కేసులో ఏ2 వ్యాఖ్యలతో తెలుగుదేశంలో కలవరం

Update: 2020-03-17 15:30 GMT
తెలుగురాష్ట్రాల తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు మరోసారి తెరపైకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల తో ముడిపడిన ఆ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి నిజనిజాలన్నీ చెబుతానని ప్రకటన చేయడం తో ప్రధానంగా ఇద్దరి వ్యక్తుల్లో ఆందోళన మొదలైంది. అదే ఓటుకు కోట్లు కేసు. ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఏసీబీ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులు కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డి ఓ కేసు విషయంలో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నాడు. దీంతో ఆయన కోర్టుకు హాజరుకాలేదు. అయితే ఆ కేసులో ఏ2గా ఉన్న కీలక వ్యక్తి సెబాస్టియన్ కోర్టుకు హాజరయ్యాడు. ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ కొనసాగించగా సెబాస్టియన్ కోర్టు ఎదుట హాజరయ్యాడు. అయితే వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్‌ 20వ తేదీకి వాయిదా వేసింది.

అనంతరం కోర్టు వెలుపలకు వచ్చిన అనంతరం నిందితుడు సెబాస్టియన్ మీడియా తో మాట్లాడారు. తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి.. అసలు దోషులను వదిలేస్తున్నారని వాపోయారు. బెదిరింపులు, దాడులు ఎదురవుతుండడం తో తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరాడు. టీడీపీ తనను ఈ కేసులో ఇరికించిందని ఆరోపించారు. ఆడియో టేపుల ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌పై విచారణ జరిగితే కీలక వ్యక్తులు వెలుగులోకి వస్తారని తెలిపారు. స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన నగదు ఎక్కడ నుంచి వచ్చిందో విచారణ జరగాలని పేర్కొన్నారు. ఈ కేసులో అసలు సూత్రధారి ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. నిజనిజాలన్ని కోర్టుకు తెలుపుతాననే భయం తో కొందరు తనపై దాడికి పాల్పడే అవకాశం ఉందని.. అందుకే తనకు ప్రాణహాని ఉందని సబాస్టియన్‌ వివరించారు.

2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ కు రూ.50 లక్షలు నగదు ఇస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఏసీబీ మొత్తం 960 పేజీల తో చార్జిషీట్‌ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానాల్లో విచారణ సాగుతోంది. ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను ఆరా తీసి విచారణ ఏసీబీ కోర్టులో వేగంగా సాగుతోంది. త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Tags:    

Similar News