హ‌రికృష్ణ ప్ర‌యాణం పుకార్ల‌పై టీడీపీ క్లారిటీ!

Update: 2018-08-29 16:40 GMT
టీడీపీ సీనియ‌ర్ నేత‌, సినీ న‌టుడు నంద‌మూరి హ‌రికృష్ణ ఈ రోజు తెల్ల‌వారుఝామున జ‌రిగిన ఘోర రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాలైన సంగ‌తి తెలిసిందే. నెల్లూరులో ఎన్టీఆర్ అభిమాని ఇంట్లో పెళ్లికి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని కొన్ని వార్తలు వెలువ‌డ్డాయి. ఈ నేప‌థ్యంలోనే హ‌రికృష్ణ వెళుతున్న కార్య‌క్ర‌మం, స్థ‌లం వివ‌రాల గురించి టీడీపీ అధికారికంగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. హరికృష్ణ వెళ్ల‌బోయింది ఎన్టీఆర్ అభిమాని ఇంట్లో వివాహానికి కాద‌ని, ఆయ‌న ప్ర‌యాణిస్తోంది నెల్లూరుకు కాద‌ని పార్టీ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. కావలిలోని ట్రావెల్స్ మోహన్ అనే వ్యక్తి కుమారుడి వివాహ వేడుక‌కు హ‌రికృష్ణ వెళుతున్నార‌ని, ఈ విషయాన్ని మీడియా సరిచూసుకోవాలని అధికారిక‌ ప్రకటనను విడుదల చేసింది.

ట్రావెల్ మోహన్ అనే వ్యక్తి టాలీవుడ్ లో ట్రావెల్స్ నడుపుతుంటార‌ని,  హరికృష్ణ కుటుంబానికి ఆయ‌న‌ అత్యంత సన్నిహితుడ‌ని హ‌రికృష్ణ మిత్రులు తెలిపారు. దీంతో, ఆయ‌న కుమారుడి వివాహానికి స్వయంగా హాజరయ్యేందుకు హ‌రికృష్ణ కావలి బయలుదేరార‌ని వెల్లడించారు. ఈ క్ర‌మంలోనే హైదరాబాద్ నుంచి కావలి వెళ్తుండగా తెల్ల‌వారుఝామున నల్ల‌గొండ జిల్లాలోని అన్నేపర్తి దగ్గర ఆ ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలిపారు. కాగా, నల్లగొండ జిల్లాలో 9వ నెంబ‌రు జాతీయ రహదారిపై ప్ర‌యాణిస్తూ గ‌తంలో ఎన్టీఆర్ ప్ర‌మాదానికి గుర‌య్యార‌ని, జానకిరాం చ‌నిపోయార‌ని వారు గుర్తు చేసుకున్నారు. తాజాగా హరికృష్ణ కూడా నల్లగొండ జిల్లాలోనే అదే జాతీయ ర‌హ‌దారిపై ప్రమాదానికి గురై మృత్యువాత పడడం త‌మ‌ను ఆవేద‌న‌కు గురిచేసింద‌ని అన్నారు. కాగా, అక్టోబ‌రు వ‌ర‌కు హ‌రికృష్ణను వాహ‌నాలు న‌డ‌ప‌వద్ద‌ని ఆయన సిద్ధాంతి చెప్పార‌ని, కానీ డ్రైవింగ్ ప‌ట్ల ఆయ‌న‌కున్న మ‌క్కువ వ‌ల్ల ఈ రోజు స్వ‌యంగా కావ‌లి వెళ్లేందుకు బ‌య‌లుదేరార‌ని తెలుస్తోంది. అందులోనూ, వాహ‌నంలో ముగ్గురు ఉంటె హ‌రికృష్ణ ప్ర‌యాణించ‌ర‌ని, ఈ రోజు నాలుగో వ్య‌క్తిని కూడా త‌మ వెంట తీసుకువెళ్లాల‌ని అనుకున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ, ఆ నాలుగో వ్య‌క్తి రాకుండానే ఆయ‌న బ‌య‌లుదేరార‌ని, సెంటిమెంట్ కు విరుద్ధంగా నేడు వ్య‌వ‌హ‌రించార‌ని మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.
Tags:    

Similar News