నారా వారి డైలీ సీరియ‌ల్ - తేల‌ని సీట్ల పంచాయితీ!

Update: 2019-02-07 08:11 GMT
ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయాలు వేడెక్కాయి. తమ త‌ర‌ఫున ఆయా స్థానాల్లో ఎవ‌రు పోటీ చేస్తార‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త‌నిచ్చేందుకు పార్టీలు కృషిచేస్తున్నాయి. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. నేత‌ల మ‌ధ్య‌ సీట్ల పంచాయితీల‌ను తేలుస్తున్నాయి.

ఇత‌ర పార్టీల‌తో పోలిస్తే టీడీపీలో సీట్ల పంచాయితీలు ఎక్కువ‌గా ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి చాలామంది నేత‌లు తెలుగుదేశంలో చేరారు. దీంతో ప్ర‌స్తుతం పాత, కొత్త నేత‌ల మ‌ధ్య సీట్ల పంచాయితీ జ‌రుగుతోంది. త‌మ‌కే టికెట్ కావాలంటూ వారంతా ప‌ట్టుబ‌డుతుండ‌టం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి త‌ల‌నొప్పిగా మారింది.

ఎన్నిక‌లు ముంచుకొస్తున్నా ఆయా సీట్ల పంచాయితీలు డైలీ సీరియ‌ళ్ల‌లా కొన‌సాగుతూనే ఉన్నాయి త‌ప్ప ఎటూ తేల‌డం లేదు. దీంతో ఆయా స్థానాల్లో పార్టీ శ్రేణుల్లో గంద‌ర‌గోళం నెల‌కొంటోంది. పోటీ చేసే నాయ‌కులెవ‌రో తెలియ‌క వారు తిక‌మ‌క‌ప‌డుతున్నారు. టీడీపీలో ఇలా సీట్ల పంచాయితీ తేల‌ని స్థానాల్లో ప్ర‌ధాన‌మైన‌ది జ‌మ్మ‌ల‌మ‌డుగు. వైసీపీ త‌ర‌ఫున గెల్చి టీడీపీలో చేరిన మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన రామ‌సుబ్బారెడ్డి అక్క‌డ టికెట్ ఆశిస్తున్నారు.

జ‌మ్మ‌ల‌మ‌డుగు పంచాయితీ ప‌రిష్కార‌మైంద‌ని ఓ రోజు.. ఇంకా కొన‌సాగుతోంద‌ని మ‌రో రోజు వార్త‌లొస్తున్నాయి. ఆది, రామ‌సుబ్బారెడ్డిల్లో ఎవ‌రు క‌డ‌ప లోక్ స‌భ స్థానానికి పోటీ చేస్తే వారికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేలా.. రెండో నేత‌ల‌కు జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీ సీటు కేటాయించేలా చంద్ర‌బాబు రాజీ కుదిర్చార‌ని రెండు రోజుల క్రితం క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అవ‌న్నీ ఊహాగానాలేన‌ని తాజాగా తేలిపోయింది. బుధ‌వారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు జ‌మ్మ‌ల‌మ‌డుగుపై చంద్ర‌బాబు వ‌ద్ద పంచాయితీ కొన‌సాగ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌నం.

క‌ర్నూలులో డోన్‌, ప‌త్తికొండ సీట్ల విష‌యంలోనూ చాన్నాళ్లుగా పంచాయితీ కొన‌సాగుతోంది. ఆ రెండు సీట్ల‌ను త‌మ‌కు కేటాయిస్తే కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి కుటుంబం టీడీపీలోకి వ‌చ్చానా వారితో క‌లిసి తాము ప‌నిచేస్తామ‌ని ఉప ముఖ్య‌మంత్రి కేఈ హామీ ఇస్తున్నారు. చంద్ర‌బాబు మాత్రం ఆ సీట్లు ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా కోట్ల‌తో క‌లిసి ప‌నిచేయాల్సిందేన‌ని సూచిస్తున్నారు. ఆ సీట్లు ఇచ్చేదీ లేనిదీ మాత్రం స్ప‌ష్టంగా చెప్ప‌డం లేదు. ఇంకా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ సీట్ల పంచాయితీ కొన‌సాగుతోంది. వీట‌న్నింటినీ త్వ‌ర‌గా తేల్చ‌క‌పోతే కార్య‌క‌ర్త‌ల్లో గంద‌ర‌గోళం కొన‌సాగి వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News