మాచ‌ర్ల దుమారం.. టీడీపీకి లాభ‌మెంత‌...?

Update: 2022-12-18 15:30 GMT
ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల‌లో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య మ‌రో దుమారం రేగింది.  టీడీపీకి పెద్ద‌గా ప‌ట్టు లేని ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు పెంచుకోవాల‌నేది పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహంగా ఉంది. అయితే.. ఇక్క‌డ త‌మ ఇలాకాలో టీడీపీ అడుగు పెట్ట‌డాన్ని సైతం స‌హించ‌ని వైసీపీ నాయ‌కులు టీడీపీ నేత‌ల‌పై యుద్ధ‌మే చేస్తున్నారు. గ‌త ఏడాది స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలోనే టీడీపీపై తిరుగుబాటు చేసి.. నాయ‌కుల‌ను ఇక్క‌డ నుంచి పంపేశారు.

అయినా.. ప‌ట్టు వ‌ద‌ల‌కుండా.. ఇక్క‌డ ఇదేం ఖ‌ర్మ కార్య‌క్ర‌మాన్ని టీడీపీ నిర్వ‌హించేందుకు ప్ర‌య‌త్నిం చింది. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే.. జ‌రిగిన ప‌రిణామంంలో టీడీపీకి వ‌చ్చిన లాభం చూసుకుంటే.. జీరో క‌నిపిస్తోంది. ఎందుకంటే.. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు.. మాచ‌ర్ల‌కు చాలానే తేడా ఉంది. ఇక్క‌డ వైసీపీకి కంచుకోట‌గా అనేక గ్రామాలు ఉన్నాయి. అదేస‌మయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్నారెడ్డి వ‌ర్గం బ‌లంగా ఉంది.

ఇలాంటి చోట పాగా వేయాల‌నే వ్యూహం టీడీపీకి ఉన్న‌ప్ప‌టికీ.. బ‌ల‌మైన నాయ‌కులు లేక‌పోవ‌డం.. ఇక్క‌డ పిన్నెల్లికి సాటిరాగ‌ల నేత‌లను చంద్ర‌బాబు నియమించ‌క‌పోవ‌డం పెద్ద మైన‌స్‌గా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో ఇలాంటి చోట నిర్వ‌హించాల‌ని భావించిన ఏ కార్య‌క్ర‌మం కూడా స‌క్సెస్ కావ‌డం లేదు. గ‌తంలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం నిర్వ‌హించి ఘోర ప‌రాభ‌వాన్ని పొందిన విష‌యం గుర్తు  చేసుకోవాలి.

ఇక‌, ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లోకి అడుగు పెట్టాల‌ని అనుకుంటే.. ముందుగా బ‌ల‌మైన నాయ‌కుడికి ఇక్క‌డ  ప‌గ్గాలు అప్ప‌గించ‌డ‌మో.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌డ‌మో చేయాలి. ఇలాంటి చేయ‌కుండా కేవ‌లం ఏదో కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌నేఉత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డం వ‌ల్ల పార్టీ సాధించేది ఏమీ లేద‌ని.. అన‌వ‌స‌ర వివాదాలు.. నాయ‌కుల‌పై కేసులు త‌ప్ప ఏమీ మిగ‌ల‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News