మంగళగిరిలో బాబు ఆర్మీ ఆరాచకం

Update: 2019-03-31 11:44 GMT
ఎన్నికల వేళ అధికార బలంతో చంద్రబాబు అక్రమాలకు తెరతీశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీ పోలీసులు కూడా బాబుకు ఏకపక్షంగా సహకరిస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న ఉదంతం తాజాగా బయటపడింది. రాష్ట్రానికి కొత్తగా ఎవరొచ్చినా వారిని అనుమానంతో చూస్తూ అక్రమంగా నిర్బంధించిన వ్యవహారం తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో చోటుచేసుకుంది.

మంగళగిరిలో ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పోటీచేస్తున్నారు. దీంతో అక్కడ లోకేష్ ను ఎలాగైనా గెలిపించేందుకు చంద్రబాబు పోలీసులతో కలిసి జులుం ప్రదర్శిస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి వ్యక్తిగత పనిమీద మంగళగిరి వచ్చిన కొంత మంది యువకులను నిర్బంధించి పోలీస్ స్టేషన్ కు తరలించడం వివాదాస్పదమైంది.

మంగళగిరికి హైదరాబాద్ నుంచి వచ్చిన యువకులను వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంగా భావించిన టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి ఆధారాలు లేకుండానే నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. ఆ తరువాత నిజం తెలుసుకున్న పోలీసులు తప్పని తెలిసి వారిని వదిలేశారు.

ఈ వ్యవహారం దుమారం రేపుతోంది. ఏపీ పోలీసులు యువకుల పట్ల వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది. స్నేహితుడిని కలవడానికి వచ్చిన తమని ఇలా నిర్బంధించడాన్ని వారు మీడియాకు ఎక్కి నిలదీయడంతో టీడీపీ ప్రభుత్వం-పోలీసులు అభాసుపాలవుతున్నారు.
    

Tags:    

Similar News