టీడీపీ నా బ్రెయిన్ చైల్డ్... ఎన్టీయార్ వచ్చి చేరాడంతే...?

Update: 2022-10-24 09:32 GMT
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం. దానికి ముందు ఉన్న పార్టీలు అన్నీ జాతీయ పార్టీలే. పైగా మూడున్నర పదుల కాలం ఉమ్మడి ఏపీని కాంగ్రెస్ ఏలుతూ వచ్చింది. మధ్యలో జనతా పార్టీ ఏర్పడి ఏపీలో కొంత సవాల్ చేసినా కాంగ్రెస్ ని నిలువరించలేకపోయింది. దానికి ముందు వామపక్షాలు ఏపీలో కాంగ్రెస్ తో సై అంటూ కొంత వరకూ తమ హవా చాటుకున్నా కాంగ్రెస్ నుంచి అధికారాన్ని దూరం చేయలేకపోయాయి.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ మీద ప్రజలు తీవ్రంగా వ్యతిరేకత పెంచుకున్న నేపధ్యంలో సరైన సమయంలో ఏర్పడిన టీడీపీ సూపర్ హిట్ అయింది. టీడీపీని స్థాపించింది ఎవరు అంతే ఎన్టీయార్  అనే అంతా చెబుతారు. అయితే టీడీపీ పేరు కానీ లోగో కానీ అసలు జెండా కానీ అజెండా తో సహా ఆలోచనలు అన్నీ కూడా తనవే అని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అంటున్నారు. ఆయన వయసు ఇపుడు ఎనభై తొమ్మిదేళ్ళు.

ఈ వయసులో కూడా ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. చాలా చురుకుగా ఉన్నారు. ఆనాడు జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్లుగా తాజాగా ఒక యూ ట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాదెండ్ల పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీని ఎలా తాను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. దానికి ముందు నేపధ్యం ఏంటి అన్నది ఆయన చాలా డిటైల్డ్ గా వివరించారు. కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ఐ గా ఇందిరాగాంధీ మార్చిన తరువాత 1978లో ఏపీలో కాంగ్రెస్ ఐ బంపర్ విక్టరీ కొట్టింది.

ఆ పార్టీ తరఫున తొలి ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఎంపిక అయ్యారు. ఆయన రెండేళ్ళు పాలించిన తరువాత 1980 అక్టోబర్ లో టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మంత్రివరంలో నాదెండ్ల భాస్కరరావు కీలక మైన శాఖలను  నిర్వహించారు. అయితే ఇద్దరు మధ్యన విభేదాలు రావడంతో పాటు కాంగ్రెస్ లో కమ్మలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు ముఖ్యమంత్రి పదవులకు ఎపుడూ రెడ్లనే తీసుకుంటున్నారు అన్న బాధతో మధ్యలోనే నాదెండ్ల తన మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు.

ఆ టైం లోనే ఆయనలో కొత్త పార్టీ పెట్టాలని ఆలోచనలు వచ్చాయట. అలా తనకు కలసిన ఎమ్మెల్యేలు సీనియర్ నేతలను కలుపుకుని నాదెండ్ల తెలుగుదేశం పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన లోగోను తయారు చేయించారుట. పార్టీ జెండాతో పాటు అజెండాను కూడా తయారు చేసి ఎన్నికల కోసం రెడీ అవుతున్న వేళ ఎన్టీయార్ తన వద్దకు వచ్చారని నాదెండ్ల చెప్పుకొచ్చారు.

తాను అన్నవరంలో ఒక గెస్ట్ హౌస్ లో ఉండగా అక్కడకు ఎన్టీయార్ మొదటిసారి వచ్చారని, ఆ తరువాత హైదరాబాద్ లో తాను కొత్త  పార్టీ కోసం తన వర్గం ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూండగా ఎన్టీయార్ అక్కడికి  సడెన్ గా వచ్చి ఆ మీటింగులో తానూ కూర్చున్నారని చెప్పారు. ఎన్టీయార్ వయసులో తన కన్నా పదకొండేళ్ళు పెద్ద వారని, అందుకే పెద్దాయన అన్న గౌరవంతో  ఆ సమావేశంలో ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టి తాను పక్క సీట్లో కూర్చున్నానని నాదెండ్ల గత అనుభవనాలు చెప్పుకొచ్చారు. అయితే అక్కడికి హాజరైన ఎమ్మెల్యేలు మాత్రం ఎన్టీయార్  కి పార్టీ  సారధ్య బాధ్యతలు అప్పగించవద్దు అని మాట్లాడారని నాదెండ్ల వివరించారు.

ఇక ఆ తరువాత అడపా తడపా ఎన్టీయార్  తన వద్దకు రావడం తనకు రాజకీయాల్లో చేరాలని ఉందని చెబుతూ తాను కొత్త పార్టీకి గౌరవ చైర్మన్ గా మాత్రమే ఉంటానని చెప్పారని గుర్తు చేసుకున్నారు. సినీ గ్లామర్ ఆయనకు ఉంది కదా అని తాను కూడా ఆయనను తన పార్టీలోకి తీసుకున్నాను అన్నారు. ఆ తరువాత ఎంటీయార్ తనతో ఒక వైపు అన్ని విషయాలూ మాట్లాడుతూనే ఒక మీడియాధిపతితో సన్నిహితం అయ్యారని చెప్పుకొచ్చారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సంబంధించి అన్నీ తాను చూసుకున్నానని, అభ్యర్ధుల ఎంపిక విషయం కూడా ఎన్టీయార్ తానూ కలిసే నిర్ణయించామని చెప్పారు.

తెలుగుదేశం పార్టీకి ఎన్టీయార్ నే అధ్యక్షుడిగా ఉంచడం అన్నది రాజకీయ ఎత్తుగడగా ఆయన చెప్పారు. అయితే ఆ తరువాత కాలంలో కూడా ఎన్టీయార్  తెలుగుదేశం తన ఆలోచన కాదు నాదెండ్ల పుర్రెలో పుట్టిన ఆలోచన అని పలు మీడియా సమావేశాల్లో కూడా చెప్పారని గుర్తు చేశారు. కానీ తరువాత రోజులలో మాత్రం ఎన్టీయార్ ను ఒక మీడియాధిపతి కొందరు వ్యక్తులు కలసి ఏమార్చారని, చివరికి ఎన్టీయార్  కి తనకూ మధ్య అపార్ధాలు వచ్చేలా చేశారని, మొత్తానికి చూస్తే టీడీపీ తాను పెట్టిన పార్టీ ఎన్టీయార్  తనదిగా చెప్పుకునేదాకా పరిస్థితితులను తీసుకొచ్చారని వాపోయారు.

నాదెండ్ల తాను చెప్పిన ప్రతీ దానికీ ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఎన్టీయార్ నుంచి చంద్రబాబు టీడీపీని లాగేసుకున్నారు అన్నది పాత కధ, తన నుంచి ఎన్టీయార్  టీడీపీని తీసేసుకున్నారు అన్నది కొత్త కధ. మరి ఇపుడు దీని మీద కూడా రాజకీయ రచ్చ జరిగే అవకాశం ఉందేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News